14 August, 2026 | 6:23 PM

శ్రీధర్‌రెడ్డి హత్యకు నాకు సంబంధం లేదు

25-05-2024 01:00 AM

తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు దావా వేస్తా

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్పందన 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి):  పాలమూరు జిల్లా లక్ష్మిపల్లిలో జరిగిన హత్యలో తనకు ప్రమేయం ఉందని బీఆర్‌ఎస్ నేతలు బురజల్లే ప్రయత్నం చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అసలు ఆ గ్రామానికి వెళ్లి  జరిగిందేమిటో ప్రజలు చెబితే విందామనిబీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవితో కలిసి మీడియాతో మాట్లాడారు. బేకూబ్ మాటలు మాట్లాడ వద్దని,  తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

గండ్రపల్లి హత్యోదంతంలో తన ప్రమేయం లేదని రిపోర్టుతో తేలిందని, బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చినందుకే తనపై కక్షపూరితంగా అవాస్తవాలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డి హత్యపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. అవగాహన లేకుండా మాట్లాడవద్దని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు హితవుపలికారు. మంత్రి జూపల్లికి  నేర చరిత్ర లేదని, తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తి అని మల్లు రవి అన్నారు. అసత్య ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేతలు జూపల్లిని బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిని బీజేపీ నేతలు విమర్శిస్తే ఆ పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి సన్మానం చేస్తామని, బీజేపీ నేతలు అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారని అన్నారు.