కాంగ్రెస్ శ్రేణుల్లో నామినేటెడ్ ఉత్కంఠ
మెదక్, మే 24(విజయక్రాంతి) : నామినేటెడ్ పదవులను కోరుకునే ఆశావాహులకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. పదవుల పందేరంపై కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో బూతుల వారీగా వచ్చే ఓట్ల ఆధిక్యతను బేరీజు వేసి పదవులు ఇస్తామన్న నాయకత్వ నిర్ణయంతో హైరానా పడుతున్నారు. తమ పరిధిలోని బూత్‌లలో ఎక్కడ ఆధిక్యం వస్తుందో.. ఎక్కడ ఓట్లు తగ్గుతాయో లెక్కలేసుకుంటున్నారు. ఫలితాల కోసం ఎదురుచూపు అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు తమ ప్రయత్నాలు చేస్తూనే టెన్షన్ పడుతున్నారు.
నామినేటెడ్ పదవుల పందేరానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ఫలితం, ఆయా శాసనసభ సెగ్మెంట్లు, మండలాలు, బూత్‌ల వారీగా సాధించే ఆధిక్యతను పరిగణలోకి తీసుకుంటామని పార్టీ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 4 వరకు ఓట్ల లెక్కింపు కోసం ఎదురు చూడాల్సిన నేపథ్యంలో బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు వస్తాయనే విషయమై ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇలావుండగా మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ, గ్రంథాలయ కమిటీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న నాయకులు, సీనియర్ కార్యకర్తల సంఖ్య భారీగానే ఉంది. ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందేనని, ఆ తర్వాత సైతం బూత్‌ల వారీగా ఆధిక్యతను బట్టి పదవులు ఇస్తామని అధినాయకులు చెప్పడంతో పరేషాన్‌లో ఉన్నారు.






