విజయ్ వాయిస్ విని ఆశ్చర్యపోయా
‘పుష్ప 2 ది రూల్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరోయిన్ రష్మిక మందన్నా మంచి జోష్ మీదున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకూ ఆమె నటించిన హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రణ్‌బీర్ కపూర్‌తో వర్క్ సునాయాసంగా చేయవచ్చు. అల్లు అర్జున్ గొప్ప నటుడు.
‘పుష్ప 2’లో ఆయన నటన అద్భుతం. చీర ధరించి డ్యాన్స్ చేయడం.. ఫైట్ చేయడం.. కేవలం ఆయన వల్లే సాధ్యమైంది. సల్మాన్‌ఖాన్ సెట్‌లో సరదాగా జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. విక్కీ కౌశల్ యాక్టింగ్‌లో దిట్ట. ఆయన నుంచి నటనకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. విజయ్ దేవరకొండకు నేను వీరాభిమానిని. ఆయన అంటే నాకెంతో ఇష్టం” అన్నారు. అలాగే విజయ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. “విజయ్ నాకెప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కు విజయ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం చివరి వరకూ నాకు తెలియదు. అది విడుదలయ్యాక విజయ్ వాయిస్ విని నేను ఆశ్చర్యపోయా. నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది” అని రష్మిక తెలిపారు. రష్మిక ప్రస్తుతం నటిస్తున్న ‘సికందర్’, ‘ఛావా’, ‘కుబేర’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.






