ఇన్నాళ్లూ సహించా.. ఇకపై ఎవ్వరినీ వదలను
ప్రస్తుతం సాయిపల్లవి దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ సినిమా సైతం చేస్తున్నారు. ‘రామాయణ’ చిత్రంతో ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. తన గురించి వస్తున్న నిరాధార వార్తలపై సాయిపల్లవి ఫైర్ అయ్యారు. ఇక మీదట ఇలాంటి నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘రామాయణ’ చిత్రం కోసం సాయిపల్లవి తన అలవాట్లను మార్చుకున్నారంటూ కోలీవుడ్‌లో వార్త లొచ్చాయి.
ఆమె సినిమా పూర్తయ్యే వరకూ మాంసాహారంతో పాటు హోటల్ ఫుడ్ మానేశారని, ఆమె ఎక్కడికి వెళ్లినా తనతో పాటు వంటవాళ్లను తీసుకెళుతున్నారంటూ వార్తలొచ్చాయి. దీనిపై సాయిపల్లవి ఒకింత ఘాటుగా స్పందించారు.“నాపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. వచ్చిన ప్రతిసారి మౌనంగానే ఉన్నా. నిజమేంటో దేవుడికి తెలుసు. కానీ నా మౌనాన్ని అలుసుగా తీసుకుని తెగ వార్తలు రాసేస్తున్నారు.
అందుకే స్పందించాల్సి వచ్చింది. నాకు సంబంధించి ఏమైనా నిరాధార వార్తలు ప్రచురిస్తే అది ఎంత గుర్తింపు పొందిన మీడియా సంస్థ అయినా కూడా చట్టబద్దమైన యాక్షన్ తీసుకుంటా. ఇ న్నాళ్లూ సహించా. ఇకపై చెత్త కథనాలను ప్రచురిస్తే ఎవ్వరినీ వదలను” అని సాయి పల్లవి పోస్ట్ పెట్టారు. సాయిపల్లవి ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు.






