ఏడాది చివరి నుంచి వరుసగా సినిమాలు చేస్తా..
అనుష్క శెట్టి రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’. ఆమె నుంచి దాదాపు రెండే ళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ సమ ర్పిస్తు న్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
దీంతో మేక ర్స్ ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ ఇద్దరికీ స్నేహితుడైన రానా దగ్గుబాటి.. అనుష్కతో ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భం గా ‘ఘాటి’ కంటెంట్, తన పాత్ర గురించి అడిగినప్పుడు.. అనుష్క సినిమా విశేషాలు పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
‘ఘాటి’ వైలెంట్, ఇంటెన్స్ మూవీ. ఇందులోని వయోలెన్స్ను పక్కన పెడితే ఈ కథ ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు సరిపోతుంది. ఇలాంటి కథకు ఇది సరైన సమయం అని భావిస్తున్నా. ‘బాహుబలి’, ‘అరుంధతి’ తర్వాత వరుసలో ‘ఘాటి’ నిలుస్తుంది.
కథ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరుగుతుంది. ఈ బ్యాక్ డ్రాప్, విజువల్స్ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతినిస్తాయి. ప్రారంభంలో ఇదొక సమూహం కథగా వుంటుంది. అయితే కథ జూమ్ అయ్యే కొద్దీ వ్యక్తిగతంగా మారుతుంది. దేశిరాజు, శీలావతి క్యారెక్టర్స్ జర్నీని క్రిష్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో ప్రతిదీ సహజంగా ఉంటుంది.
కథలో అద్భుతమైన ట్రాన్ఫర్మేషన్ వుంది. బాధితురాలు తన దారి తానే ఎంచుకున్నప్పుడు, ఆమె క్రిమినల్ అవుతుంది. కానీ ఆ ప్రయాణంలోనుంచి లేచి, ఒక లెజెండ్గా మారుతుంది. అదే రిడంప్షన్ ఆర్క్. మనం కోల్పోయిన దాంట్లోంచి మళ్లీ లేచినప్పుడే మనం మరింత గొప్పగా మారతాం. ఈ కథను చెప్పిన తీరు నిజంగా అద్భుతంగా ఉంది.
క్రిష్ నాకెప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు. ‘వేదం’లో సరోజ కూడా చాలా సున్నితమైన పాత్ర. దాన్ని ఆయన గొప్పగా చూపించారు. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో అదీ ఒకటి. ఇప్పుడు ’ఘాటి’లో శీలావతి కూడా అలాంటి మెమరబుల్ క్యారెక్టర్. అలాగే ఈ ఏడాది చివరి నుంచి వరుసగా కొత్త ప్రాజెక్టులు చేస్తాను.






