చాల్బాజ్ రీమేక్‌లో జాన్వీ
శ్రీదేవి, రజనీకాంత్, సన్నీదేవోల్ నటించిన హిట్ సినిమా ‘చాల్బాజ్’. 1989లో వచ్చిన ఈ చిత్రం నటన పరంగా శ్రీదేవి కెరీర్లోనే బెస్ట్ సినిమాల లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటుంది. పంకజ్ పరాశర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రీమేక్ ఇప్పటికే ఎన్నోసార్లు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తాజాగా మరోసారి ఇది హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత జాన్వీకపూర్‌తో ఈ సినిమా తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తన తల్లి శ్రీదేవికి సంబంధించిన విషయాలే కాదు.. ఆమె నటించిన ప్రతి చిత్రం తనకు ఓ ఎమోషన్ అని జాన్వీకపూర్ ఎప్పుడూ చెబుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెతో అనుబంధాన్ని పంచుకుంటుంటారు. అందుకే ‘చాల్బాజ్’లో శ్రీదేవి పాత్రను పోషించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. జాన్వీకి ఇష్టమైన శ్రీదేవి సినిమాల్లో ‘చాల్బాజ్’ కూడా ఒకటని చాలెంజ్ తీసుకొని ఈ పాత్ర కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని,
ఈ రీమేక్ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయాన్ని కూడా ఈ నెల చివరినాటికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో ఈ సినిమాను శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో ‘చాల్బాజ్ ఇన్ లండన్’ పేరుతో రీమేక్ చేయాలని పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.
ఇప్పుడు జాన్వీ నటించనున్నట్లు వార్తలు రావడంతో మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘చాల్బాజ్’లో శ్రీదేవి ద్విపాత్రాభినయంలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు జాన్వీ కూడా అలానే కనిపిస్తారా.. లేదంటే రీమేక్ కథలో మార్పులు చేస్తారా... అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.






