15 June, 2026 | 1:26 AM

పచ్చని మొక్కనై వికసిస్తా !

15-06-2026 12:00 AM

జీవితం పలుచనై చిల్లులు పడ్డది

ఎంత సర్దినా అటు ఇటు అయితుంది

పీలికలతో ఎంత కుట్టినా అతుకుల బొంతలా తయారైంది

కొత్త పూత కోసం సేద్యం చేసి చేసి 

అలసిన నా ఎదురుచూపులు

ఆలోచనల కట్టెల్లో కాలిపోతున్నవి

నిన్నటిని తెంపుకొచ్చి ఎంత వెలిగించినా 

గుడ్డిదీపంలా మినుకు మినుకుమంటున్నది

నిత్యం నేను తూర్పున ఉదయిస్తున్నా

వెనువెంటనే పడమరలో అస్తమిస్తున్నా

చీకటి ప్రయాణంలో వెలుగుల జాడలు 

కలలో తప్ప ఎదురుపడుటలేదు

అయినా.. పయనం ఆపను..

ఎప్పకటికైనా పచ్చని జీవితపు 

మొక్కనై వికసిస్తా !!