హార్ట్ ఎక్స్ రే ఉండి ఉంటే..
15-06-2026 12:00 AM
గుండెకు కూడా ‘ఎక్స్ రే’
ఏదైనా ఉండి ఉంటే బాగుండేది!
అప్పుడు.. చిరునవ్వుల తెరల వెనుక
నలిగి వేలాడుతున్న ఆశల ఉరితాళ్లు కనిపించేవి
కళ్లల్లో మెరిసే కాంతి కింద గూడుకట్టుకున్న
చీకటి సామ్రాజ్యాలు కనిపించేవి
రక్తం చిందకుండానే... కొందరు
ఎలా మరణిస్తున్నారో అర్థమయ్యేది
వృక్ష గర్భంలో దాగున్న గొడ్డలి గాయంలా
కొన్ని జ్ఞాపకాలు వసంతాలనే
కొరికి తింటుంటాయి
మాటలు మొలకెత్తని శూన్యంలో
వేదనలు తమ అఖండ రాజ్యాలు
నిర్మించుకుంటాయి
‘బాగున్నాను’ అనే ఒకే ఒక్క మాట వెనుక
ఎన్ని సునామీలు బందీలై ఉన్నాయో తెలిసేది
పైకి ప్రశాంతంగా ప్రవహించే
నదుల మౌనాల అడుగున
కొట్టుకుపోయిన శిథిల స్వప్నాలు కనిపించేవి !!






