చేనేత సొసైటీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
హనుమకొండ టౌన్ ఏప్రిల్ 15 (విజయక్రాంతి): వరంగల్ కొత్తవాడలోని చేనేత సొసైటీ బాధ్యులు బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత సొసైటీ బాధ్యులు, కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్సీ సారయ్యకు వివరించారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థిని, విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లకు కావలసిన వస్తువుల కొనుగోలుకై జరిపే టెండర్ల నుండి బెడ్ షీట్లు, జంపకాణాలను మినహాయించి, వాటిని నేరుగా చేనేత సొసైటీల ద్వారా కొనుగోలు చేయాలని, దీనివల్ల సుమారు 5000 మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని ఎమ్మెల్సీ సారయ్య కు చేనేత సంఘం బాధ్యులు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ చేనేత సొసైటీ బాధ్యులు, కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి తో నేరుగా ఫోన్లో మాట్లాడి హాస్టల్లోని విద్యార్థులకు కావాల్సిన బెడ్ షీట్లు, జంపకానాల టెండర్ ప్రక్రియ ద్వారా కాకుండా, నేరుగా చేనేత సొసైటీల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని కోరగా ఇందుకు సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, మాజీ కార్పొరేటర్ సర్వేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోరంటాల రాజు, చేనేత సొసైటీ ప్రతినిధులు డిఎస్ మూర్తి, ఎలగం భద్రయ్య, ఎలగం చిన్న కొమురయ్య, ఎలగం పెద్ద భద్రయ్య, జయరాజు, ఎలగం సాంబయ్య, మాచబత్తిని కుమారస్వామి, పతంగిని శ్రీనివాస్, కొలిపాక మధునయ్య, ఆడపు రవి, తదితరులు పాల్గొన్నారు.






