16 April, 2026 | 1:56 AM

గ్రామీణ యువతకు ‘ఐక్యత’ భరోసా

17-04-2026 12:00 AM

ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కడ్తాల్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందుల వల్ల నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది ఐక్యత ఫౌండేషన్. పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా సాగుతున్న యువత కోసం కడ్తాల్ మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని బుధవారం టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, కడ్తాల్ సీఐ గంగాధర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుంకి రెడ్డి  మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంది, కానీ సరైన మార్గదర్శకత్వం, ఆర్థిక స్తోమత లేక వారు వెనుకబడిపోతున్నారు. ఆ లోటును భర్తీ చేయడానికే హైదరాబాద్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా, నిష్ణాతులైన అధ్యాపకులతో ఈ ఉచిత శిక్షణను అందిస్తున్నాం‘ అని తెలిపారు. త్వరలోనే కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే పట్టుదలతో పాటు సమయపాలన ముఖ్యమని యువతకు దిశానిర్దేశం చేశారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను కూడా ఫౌండేషన్ తరఫున అందజేయనున్నారు.ఆర్ధిక స్థోమత లేక ఏ ఒక్క యువకుడు తన కలలను వదులుకోకూడదనేదే మా లక్ష్యం అని సుంకిరెడ్డి పేర్కొన్నారు.

కడ్తాల్ సీఐ గంగాధర్, ఎస్త్స్ర వరప్రసాద్ మాట్లాడుతూ.. సమాజ సేవలో రాఘవేందర్ రెడ్డి చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు సాధించి, సమాజానికి సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సర్పంచ్ లు తేజీ రామ్, రామ్ చందర్, అమర్ సింగ్, చిట్టి రమేష్ నాయక్, దాస్ నాయక్, రమేష్ నాయక్ పాల్గొన్నారు. అలాగే విశ్వ అకాడమీ లెక్చరర్లు విశ్వ, బిక్షులతో పాటు స్థానిక నాయకులు జలాల్, సురేందర్, మహేష్, జహంగీర్, రఘు, లింగం, మల్లేష్ నాయక్, నాగేష్ నాయక్ మరియు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.