ప్రజల కాలుకు ముల్లు విరిగితే పంటితో తీస్తా
- అఖండ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు
- అభినందన సభలో ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, జూన్ 21 (విజయక్రాంతి): తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, వారి కాళ్లకు ముల్లు విరిగితే పంటితో తీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్‌లో శుక్రవారం నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీలతో సం బంధం లేకుండా తనకు గొప్ప విజయాన్ని అందించిన మల్కాజిగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 99 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచి.. 240 సీట్లు గెలిచిన బీజేపీని కూటమి ప్రభుత్వమంటూ హేళన చేస్తోందని, కేవలం మూడు పార్టీలతో మాత్రమే కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ పదుల సంఖ్యలో పార్టీలన్నింటిని ఏకం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఎన్నికల హామీలను అమలు చేయాలని, లేకపోతే అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రిగా మిగిలి పోతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






