4 May, 2026 | 3:41 AM

అధికారికంగా వేలం నిర్వహిస్తే దొంగ చాటుగా పనులు ఎందుకు

04-05-2026 02:29 AM

సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబు చెప్పాలి...

సీసీఐ సాధన సమితి సమావేశంలో మాజీ మంత్రి రామన్న... 

ఆదిలాబాద్, మే 3 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ కు తలమనికంగా నిలిచిన సిమెంట్ ఫాక్టరీ (సీసీఐ) ని తుక్కు కింద విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ లో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ‘సీసీఐ పరిశ్రమ కొత్త పరిణామాలు-మన కర్తవ్యం‘ అనే అంశంపై చర్చ వేధిక ను నిర్వహించారు.

దీనికి ఆయా రాజకీయ పార్టీల నేతలు, సీసీఐ సాధన కమిటీ నాయకులు హాజరై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పలు తీర్మాణాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... సీసీఐ ఫ్యాక్టరీలోని పరికరాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తుక్కు కింద విక్రయానికి వేలం వేశామని ఎంపీ, ఎమ్మెల్యే లు చెప్పడం సరికాదన్నారు. అధికారికంగా వేలం జరిగితే, మరి పనులు ఎందుకు దొంగ చాటున జరుగుతున్నాయని ప్రశ్నించారు.

తాము అభివృద్ధికి ఏ మాత్రం ఆటంకం కాదని, ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల నుంచి 772 ఎకరాలు భూమి ఏ షరతులతో తీసుకున్నారో దాని ప్రకారం వారికి న్యాయం చేయడం లేదని ఆరోపించారు.

అదేవిధంగా 1500 ఎకరాలు లీజు ల్యాండ్ ఉందని ఆ భూమిని సదరు రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. తమ అవసరాల కోసం ఆ భూములను విక్రయిద్దామనుకున్న రిజిస్ట్రేషన్ కావడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తారా లేదా కొత్త మిషనరీలు వస్తాయా అనే దానిపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ సమావేశంలో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు నారాయణ, బండి దత్తాత్రి, ప్రహ్లాద్, లంక రాఘవులు, శివ, అరుణ్, ఈశ్వర్, వెంకట నారాయణ, అన్నమొల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.