14 July, 2026 | 10:52 PM

బీసీలను మోసం చేస్తే పుట్టగతులుండవు

09-06-2024 02:11 AM

బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్

యాదాద్రి భువనగిరి, జూన్ 8 (విజయక్రాంతి): బీసీలను మోసం చేసినందుకే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆరోపించారు. ఈసారి అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరిం చారు. ఈ నెల 15వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న బీసీ మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను బీసీ సంఘాల నాయకులతో కలిసి శనివారం భువనగిరిలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వెంటనే బీసీ గణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోకుండా, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ పెంచాలని కోరారు. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు నిపుణులతో కమిటీ వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు బీసీ జనసభ పోరాటం చేస్తుందని తెలిపారు. సమావేశంలో యాదవ సంఘం నాయకుడు పుట్ట వీరేశ్ యాదవ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లోడంగి గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.