చేనేతకు దీర్ఘకాలిక లబ్ధి
అలాంటి పథకాలు ప్రవేశపెడుతాం
మంత్రి తుమ్మల హామీ
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నేతన్నలకు 365 రోజులు చేతినిండా పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో తెలంగాణ పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళీ.. మంత్రిని శనివారం కలిసి చేనేత సహకార సంఘాల్లో వస్త్రాలను ప్రభుత్వం ఖరీదు చేసి, బకాయిలను త్వరగా చెల్లించాలని కోరారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని, మా ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని ప్రభుత్వ శాఖల్లో టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ద్వారా రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రూ.33.23 కోట్లు 10 శాతం యార్న్ సబ్సిడీని టెస్కో నిధుల నుంచి విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సంఘాల్లో ఉత్పత్తి అయ్యే వివిధ రకాల వస్త్రాలకు మార్కెట్‌ల్లో డిమాండ్ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్‌లో పోటీ పడే విధంగా నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలని సూచించారు.






