నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు
ఉదయం 10 గంటలకు విడుదల
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జాతీయ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరుకాగా, వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ విద్యార్థులు 24 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఈనెల 10 నుంచి జూలై 23వ తేదీ వరకు కొనసాగనుంది. దీనిద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లు కేటాయించనున్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ మద్రాస్ ఈ ఫలితాలను నేడు విడుదల చేయనుంది.






