30-06-2024 12:05:00 AM
భారతీయ చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఒకవైపు.. భారతీయ సినిమాకి ముఖచిత్రంగా మారుతున్న ప్రభాస్ మరోవైపు. ఈ ముగ్గురితో కలిసి సినిమా చేస్తానంటే నిర్మాణ వ్యయంతో పాటు దర్శకుడి ప్రతిభ, అనుభవం విషయంలోనూ నిర్మాతకి బోలెడన్ని లెక్కలుంటాయి. అయితే “తొలి నుంచి దర్శకులను నమ్మి చేయడమే నా పంథా” అని అంటున్నారు ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయం నమోదు చేస్తున్న ఈ సినిమా గురించి ఆయన పాత్రికేయులతో పంచుకున్న సంగతులు..
నాగ్ అశ్విన్‌తో -తన మొదటి సినిమా నుంచి ప్రయాణం చేస్తున్నాం. తను ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు వుంది. అదే మా స్వప్న, ప్రియాంక లతో చెప్పాను. ఆయన ఏ కథ చెప్పినా వెంటనే దూకేయమన్నాను. తండ్రిగా నేను చాలా అదృష్టవంతుడిని. మా అమ్మాయిలు సంస్థని గొప్ప శిఖరాలకి తీసుకెళుతున్నారు. వారు ఎదుగుతున్న తీరుపై ఎంతో గర్వపడుతున్నాను. నాగ్ అశ్విన్ రూపంలో ఈ శతాబ్దంలో ఒక గొప్ప దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు.
‘కల్కి’ కలెక్షన్లు
‘కల్కి’ కలెక్షన్లు సుమారు 14 వందల కోట్ల వరకు చేరతాయని అశ్వినీదత్ అంచనా వేయగా, తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 298.5 కోట్లు రాబట్టినట్టు నిర్మాణ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
ఆయనో లెజెండ్..
ఇటీవల ముంబయిలో జరిగిన ‘కల్కి’ ప్రచార కార్యక్రమాల్లో అమితాబ్ బచ్చన్ అశ్వినీదత్ కాళ్ళకు నమస్కారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ “మేము కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుని అక్కడితో ఆగిపోతాం. అయితే వేదిక మీద ఆయన అలా చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఆయనో లెజెండ్” అని అన్నారు. ఈ సినిమాకి ప్రపంచంలోని నలుమూలలా గల ప్రేక్షకులతో పాటు పలువురు చిత్ర ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రఖ్యాత కథానాయకుడు రజనీకాంత్ సినిమా చూసిన అనంతరం “కల్కి చూశాను. చారిత్రాత్మక చిత్రమిది. దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా నా మితృలైన అశ్వినీదత్‌కు అభినందనలు. రెండవ భాగం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నా” అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన తో పాటు మోహన్‌బాబు, సూర్య వంటి ఎందరో చి త్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సిని మా విజయాన్ని కొనియాడుతున్నారు.