30-06-2024 12:05:00 AM
అందరూ కాదు గానీ, కొందరు సినీ తారలుంటారు.. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు.. వయసు మీద పడుతున్నా సరే డబ్బు కోసం తహతహలాడిపోతుంటారు. దాని కోసం వారు చేసే ఆలోచనలకు సరిహద్దులంటూ ఏమీ ఉండవు.. అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్ తాజా వ్యవహారమే నిదర్శనం అంటూ ఆమె ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అప్పట్లో ‘ఏక్ దో తీన్ చార్ పాంచ్..’ అంటూ డ్యాన్సులతో హుషారెత్తించిన మాధురి దీక్షిత్‌ను చప్పట్లతో సత్కరించిన అభిమానులే ఇప్పుడు ఆమె.. రెహాన్ సిద్ధిఖీ అనే వ్యాపారి ప్రచార కార్యక్రమానికి వెళ్తుండాన్ని ఛీత్కరించుకుంటున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రెహాన్ సిద్ధిఖీ ఓ పాకిస్థానీ. ఉగ్రవాద మద్దతుదారు అని పేర్కొంటూ భారత ప్రభుత్వం ఆయనపై నిఘా ఉంచింది. రెహాన్ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అలాంటి వ్యక్తి నిర్వహించే ప్రోగ్రాంకు మాధురి వెళ్లడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. సునంద వశిష్ట అనే పొలిటికల్ కాలమిస్ట్ చేసిన ట్విట్ అయితే చాలా వైరల్ అవుతోంది. ‘ఇలాంటి వాడి కార్యక్రమానికి ఎందుకు వెళ్తున్నావో నీ దగ్గర సరైన కారణం ఉందా మాధురీ?
ఎవరైనా ఆ వ్యక్తి గురించి ఆమెకు కాస్త చెప్పండి.. సరిహద్దుల్లో మనకోసం ప్రాణాలకు తెగించి కాపలా కాసే సైనికులకు, మహిళలకు మాధురి చర్య నిరుత్సాహాన్ని కలిగిస్తోంది’ అంటూ ఆవేదన వెళ్లగక్కుతూ సునంద వశిష్ట పెట్టిన పోస్టుకు అనుకూలంగా, మాధురీ దీక్షిత్‌కు వ్యతిరేకంగా ఘాటుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికైతే మాధురీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఆమె నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. లేక ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆగస్టు 16న నిర్వహించే ఆ ప్రచార కార్యక్రబమం కోసం ఆమెరికా విమానం ఎక్కేస్తుందా చూడాలి!