ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే ఉపేక్షించం
- హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేస్తే ఉపేక్షించేది లేదని హెచ్‌ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి, శేరిలింగంపల్లి తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ నర్సింహరావు తెలిపారు. మియాపూర్‌లోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని వారు శనివారం సందర్శించారు. గుడిసెలు వేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా మియాపూర్‌లో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి సామాన్య ప్రజలను ఉసిగొల్పి గుడిసెలు వేయిస్తున్నారని ఆరోపించారు. వారిని నమ్మి వివిధ జిల్లాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఆక్రమణకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
సర్వే నంబర్ 100, 101లోని హెచ్‌ఎండీఏకు సంబంధించిన 500 ఎకరాల భూములున్నాయని, ఆ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని తెలిపారు. ఇవి ప్రభుత్వ భూములని తెలియక గతంలో 16 మంది ఆ భూములను కొన్నారని తెలిపారు. కోర్టులో కేసులు వేయగా ఆ భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కూడా కేసు విచారణ సాగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కావాలంటే రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్‌ఎండీఏ అధికారి వీరారెడ్డి సూచించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమణలను తొలగిస్తా మని చెప్పారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.






