క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపికలు
హైదరాబాద్: జిల్లాలోని వివిధ క్రీడా పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరానికి నాలుగవ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి తెలిపారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ నందు జూన్ 27 నుంచి 30 వరకు ఉదయం 8 గంటల నుంచి జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 30మీటర్ల ఫ్లుయింగ్ స్టార్, షటిల్న్, స్ట్రాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, 1కేజీ మోడీసిన్ బాల్‌త్రో, 800మీటర్ల పరుగు పోటీలతో పాటు బరువు, ఎత్తు, మెడికల్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. ప్రవేశాలు పొందాలనుకునే వారు 1.9.2015 నుంచి 31.8.2016 మధ్య పుట్టిన వారై ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 24, 25 తేదీలలో మండలస్థాయి ఎంపికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, జనన, వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, మూడవ తరగతి ప్రోగ్రెస్ కార్డు, పాస్ ఫోటోలను దరఖాస్తులో పొందుపర్చాలని సూచించారు.






