29 March, 2026 | 3:40 AM

మూసీని అడ్డుకుంటే.. శివతాండవమే!

29-03-2026 01:45 AM

పునరుజ్జీవన సంకల్పానికి శివదీక్ష 

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన 

8 ఎకరాలు, 700 కోట్ల బడ్జెట్

రంగారెడ్డి, మార్చి 28 (విజయక్రాంతి): ‘మూసీ ప్రక్షాళన ఒక యజ్ఞం.. దీనిని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వం శివతాండవం చేస్తుంది. మూసీ నది పునరుజ్జీవన సంకల్పానికి అడ్డంకులు సృష్టిస్తే సహించం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన విషయంలో ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసినా లేదా పనులకు ఆటంకం కలిగించినా ప్రభుత్వం ఉపేక్షించబోదని సీఎం హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంపై కొందరు బురదజల్లే ప్ర యత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివదీక్ష చేపట్టినట్టుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మూసీ తీరంలోని చారిత్రక వీరభద్ర స్వా మి ఆలయ సమీపంలో రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఓంకారేశ్వర ఆలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఈవీనరసింహారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి శంకు స్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడాతూ.. ఆధ్యాత్మికతకు నిలయంగా మూసీ తీరం మారను న్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మూసీ నది పొడవునా భక్తి భావం వెల్లివిరిసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. ఓంకారేశ్వరాలయం యునె స్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ నమూనాతో తీర్చిదిద్దుతాం అని చెప్పుకొచ్చారు. మూసీ తీరం సర్వమత ప్రార్థనా మందిరాలకు వేదిక కానుందని చెప్పారు. పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడలో స్వర్ణ దేవాలయాన్ని తలపించేలా గురుద్వారా, ఉప్పల్‌ెే-నాగోల్ ప్రాంతంలో అద్భు తమైన చర్చిని నిర్మిస్తాం అని పేర్కొన్నారు.

గోదావరి నీళ్లతో మూసీకి జలకళ

హైదరాబాద్ నగరం మరో ఢిల్లీలా కాలుష్య కాసారంగా మారకూడదనే ఈ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం అన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం అని, అందులో 5 టీఎంసీలను ప్రత్యేకంగా మూసీ నదిలో వదిలి, ఏడాది పొడవునా నది కళకళలాడేలా చర్యలు తీసుకుం టాం అని చెప్పారు. ‘గతంలో చాలామం ది ముఖ్యమంత్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ, ఎన్ని విమర్శలు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదు.

ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న దైవ నిర్ణయం అని సీఎం చెప్పారు. మూసీ ప్రక్షాళన కేవలం హైదరాబాద్ కోసమే కాదని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం కూడా అని సీఎం గుర్తు చేశారు. ప్రస్తు తం నగరంలోని డ్రైనేజీ, రసాయన కాలుష్యం అంతా మూసీ ద్వారా నల్లగొండకు చేరుతోందని, దీనివల్ల అక్కడి ప్రజలు భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని కడిగేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

అక్క.. కేసు వెనక్కి తీసుకో..

గత 45 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో అన్ని రకాల పదవులను అనుభవించి, ఇప్పుడు అదే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఓ అక్క వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితారెడ్డిని ఉద్దేశించి సీఎం విమర్శించారు. ‘మేము చేయలేని పనిని ఇంకెవరు చేయకూడదు’ అనే అక్కసుతోనే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ అక్క కొడుకు మూసీ ప్రక్షాళన ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో తప్పుడు కేసు వేశాడు. ఈ వేదిక నుంచి అక్కకు చెపుతున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి వేసిన కేసును వెనక్కి తీసుకోండి. లేకుంటే ఈ ప్రాంత ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారు’ అని సీఎం హెచ్చరించారు.

ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి, మళ్లీ ఆ ప్రజలకే నష్టం కలిగించేలా కేసులకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే ముఖ్యమని భావించే వారికి ప్రజాప్రతినిధులుగా కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు అందరూ ప్రక్షాళనకు సహకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం కోసం కృతనిశ్చయంతో ఉందని, అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు.