అధికారులకు మంత్రి అడ్లూరి స్వీట్ వార్నింగ్!
రానున్న 45 రోజుల్లో ప్రస్తుత సమస్యలు ఏవీ కూడా మళ్ళీ పునరావృతం కావొద్దు
ప్రజలకు జవాబుదారిగా ఉండకపోతే చర్యలు తప్పవు
గ్రామాల అభివృద్ధిలో అధికారులు బాధ్యతతో పనిచేయ్యాల్సిందే
వెల్గటూర్ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి,(విజయక్రాంతి): అధికారులు ప్రజలకు జవాబుదారిగా వ్యవహరిస్తూ, గ్రామాల అభివృద్ధికి బాధ్యతతో పనిచెయ్యాలంటూ, బాధ్యత మర్చిపోయి వ్యవహరిస్తే చర్యలు తప్పవంటూ అధికారులకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వెల్గటూర్ మండల మొట్టమొదటి సమీక్షా సమావేశానికి బుధవారం ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అధికారులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
ప్రజలచే ఎన్నుకోబడ్డ సర్పంచ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు తమ తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకోచ్చినప్పుడు, వారి సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చెయ్యాలనీ, లేని యెడల చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. అధికారులు సమస్యల పరిష్కారంలో తమ పరిధి దాటితే ప్రభుత్వపరంగా మాయొక్క సహాయాన్ని తీసుకోవచ్చనీ, ప్రజలకు సేవ చేసేందుకే మంత్రిగా ఉన్నాననీ స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు చూడాల్సింది సమస్యలను మాత్రమే అనీ, సమస్యలు ప్రస్తావించింది.
ఏపార్టీకి చెందినవారు అనీ కాదనీ, ఎలక్షన్ల టైంలో మాత్రమే రాజకీయం ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీల అవసరాలపై అధికారులతో సమీక్షా నిర్వహించారు.తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఎస్‌ఐఆర్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసిన బీఎల్‌ఓలను మంత్రి సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్, మండల అభివృద్ధి అధికారి పాడి వెంకట్ ప్రసాద్, ఎంపీవో దొండ కృపాకర్, ఎండపల్లి తహసీల్దార్ ఎడ్ల అనిల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి పెండ్యాల సాయి కిరణ్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గోళ్ల తిరుపతి,సర్పంచ్ లు బండమీద కవితగోపి,దోరిశెట్టి మల్లేశం,నల్ల తిరుపతి, జక్కుల ఆమని మహేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






