29 July, 2026 | 7:58 PM

Breaking News

బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •   పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు   •   పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు   •  

భారీ వర్షాల వేళా అప్రమత్తంగా ఉండండి

29-07-2026 07:18 PM

- కోటపల్లి సీఐ కృష్ణ హెచ్చరిక

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సర్కిల్ పోలీసులు హెచ్చరించారు. కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్. కృష్ణ అత్యవసర సూచనలు జారీ చేస్తూ, నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది, వాగులు, వంకలు, చెరువులు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరదనీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.

సెల్ఫీలు దిగడం, స్నానం చేయడం, చేపల వేటకు వెళ్లడం లేదా వరదనీటిని దాటేందుకు ప్రయత్నించడం వంటి సాహసాలు చేయవద్దని స్పష్టం చేశారు. పాత మట్టి ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. గోడల్లో పగుళ్లు, పైకప్పు నుంచి నీరు కారడం, గోడలు వంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.

తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. పశువుల కాపర్లు వర్ష పరిస్థితులను గమనిస్తూ పశువులను మేపాలని, గ్రామాల్లోని వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని తెలిపారు. అధిక వర్షపాతం కారణంగా జాలరులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించిన పోలీసులు, చిన్నపిల్లలను నదులు, చెరువులు, వరదనీటి ప్రవాహాల వద్దకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వరద ముప్పు, ఇల్లు కూలే ప్రమాదం, తెగిన విద్యుత్ తీగలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు కనిపించిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.