18 August, 2026 | 4:08 AM

పథకాలను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే..!

18-08-2026 02:19 AM

యాప్‌ల పేరా రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులుచెరిగిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి

మెదక్, ఆగస్టు 17(విజయ క్రాంతి) : పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు.

సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున మెదక్ నియోజక వర్గ బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో రాస్తారకో, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా ప్రజలతో చెలగాటమాడుతోందని పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.

ఈ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేస్తే, ప్రభుత్వం తడిబట్ట వేసుకుని కూర్చున్నట్లుగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. అదేవిధంగా రైతులకు యూరియా అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. యాప్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం మానుకుని, వారికి అవసరమైన ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని చూస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరించారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను స్పష్టం చేయాలని, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆరేళ్ళ మల్లిఖార్జున్ గౌడ్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగా నరేందర్, మెదక్ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ గడ్డమీది క్రిష్ణా గౌడ్, న్యాయవాది జీవన్ రావు, మెదక్ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ లు మామిండ్ల ఆంజనేయులు, మ్యాదరి దీపక్ కుమార్, సాయి, జుబేర్ అహ్మద్, మాయా గంగమణి మల్లేశం, రామాయంపేట బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ చరిత లతో పాటు మెదక్, రామాయంపేట, హవేలి ఘన్పూర్, పాపన్నపేట, నిజాంపేట, శంకరంపేట మండలాల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సోములు విష్ణువర్ధన్ రెడ్డి, రంగారావు లతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గోన్నారు.