30 March, 2026 | 2:37 AM

వారు రెడీ అయితే నేను సిద్ధం

30-03-2026 12:23 AM
  1. రేవంత్‌రెడ్డి తమ్ముళ్లు, బావమరిదిని విచారిస్తే నేనూ సిద్ధమే..

పొంగులేటికి రేవంత్‌కు మధ్య వాటాబంధాలు

రాఘవ కన్ట్స్‌క్ష్రన్స్ అవినీతిని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు

రూ.28లక్షల ఫైన్ కట్టని ఆ కంపెనీపై చర్యలేవి

సీబీ సీఐడీ రేవంత్‌రెడ్డి జేబు సంస్థ

దమ్ముంటే 19 కుంభ కోణాలపై విచారణ చేయాలి

నేడు తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముళ్లు, బావమరిది చేసిన కుంభకోణాలపై విచారణకు రెడీ అయితే మా కుటుంబ స భ్యులపై చేసిన ఆరోపణలపై విచారణకు నేను కూడా సిద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ‘పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విషయం బయట పడగానే నాపై బురద జల్లుతున్నారు. నా బావమరిది, నా తమ్ముడి పేర్లు తీసుకుంటూ మాపై ఆరోప ణలు చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీబీ సీఐడీ విచారణ కాదని, హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి రేవంత్‌రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశారు. ‘నా స్వంత ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి నేను ఫోన్ చేయలేదు’ అని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పారని, అందుకే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు.

అక్రమ మైనింగ్‌పై తమకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా, వాళ్లకి వాళ్లే సీబీ సీఐడీ విచారణ అంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని కౌశిక్‌రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టే ఆయనపై ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం దాడి చేస్తోందని, దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. బడువ అనే భాష మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని డిమాండ్ చేశారు.

దళితులపై రేవంత్‌రెడ్డి కపట ప్రేమ, ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి తప్పు చేస్తే సీబీ సీఐడీ విచారణలో న్యాయం జరుగుతుందా.. అందుకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.  అక్రమ మైనింగ్ అని మైనింగ్ శాఖ వారే రెండు సార్లు రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై రూ.28 లక్షలు ఫైన్ వేశారని, మరి ఆ ఫైన్ కట్టారా లేదా ప్రశ్నించారు.

ఆధారాలుంటే చూపించాలని, ఈ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడబోయే మరో వంద అబద్ధాలు ప్రభుత్వం బయట పెట్టుకుందని ఎద్దేవా చేశారు. సీఎస్‌వో, సీఎఫ్‌వో సమర్పించిన వారికి మీటర్ల అనుమతి ఇచ్చినప్పుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కంపెనీకి డీజిల్ జనరేటర్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 19 కుంభకోణాలు జరిగాయని దమ్ముంటే వాటిపై విచారణ చేయాలని సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన కుంభకోణాలపై విచారణ చేసేదాకా బీఆర్‌ఎస్ వదిలిపెట్టబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో భూముల సెటిల్‌మెంట్‌లో రేవంత్‌రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మధ్య వాటా బంధాలు ఉన్నాయని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై హౌస్ కమిటీ వేసే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూకుంభకోణం ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని చెప్పారు.

కొడంగల్‌పూ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్, మూసీ సుందరీకరణ టెండర్ పొంగులేటికే ఇచ్చారని, అందుకే వారిద్దరిది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. సీబీ సీఐడీ రేవంత్‌రెడ్డి జేబు సంస్థ అని, అందుకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నేడు తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ ఉంటుందని, ఏం చేయాలో మాకు ప్రణాళిక ఉందన్నారు.