calender_icon.png 21 October, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీకే ఓపెన్ కాస్ట్‌ను ప్రైవేటీకరిస్తే ఉద్యమాలు తప్పవు

17-10-2025 12:13:33 AM

వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని 

భద్రాద్రికొత్తగూడెం, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా ప్రారంభం కానున్న ’వికె ఓపెన్ కాస్ట్’ ఉపరితల గని బొగ్గు వెలికితీత పనులను కాంట్రాక్టుకు అప్పగిస్తే ఉద్యమాలు తప్పవని, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీత పనులు చేపట్టాలని సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం వికె కోల్ మైన్ (వికెఓసి), పివికె 5బి మైన్స్లో జరిగిన పిట్ మీటింగులకు అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ అంటే మక్కువ అని, ప్రజలకు చెందాల్సిన దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే చర్యలకు పాల్పడుతున్నారని, దీన్ని కార్మికవర్గం అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. కార్మిక హక్కులకు బంగం కలిగించే చర్యలను ఏలికలు మానుకోవాలన్నారు. స్ట్రక్చరల్ సమావేశాల్లో గుర్తింపు సంఘం లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లపై యాజమాన్యం స్పందించి తక్షణం పరిష్కరించాలని కోరారు. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో నూతన భూగర్భ గనుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

జీఎం కార్యాలయాన్ని సందర్శించిన కూనంనేని..

కొత్తగూడెం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు గురువారం సందర్శించారు. జనరల్ మేనేజర్ శాలేంరాజు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. అనంతరం కార్మికుల సమస్యలు, కార్మికవాడల్లో నెలకొన్న సమస్యల పరిస్కారంపై చర్చించారు. అయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కేంద్రకమిటీ నాయకులు వంగ వెంకట్, జి వీరాస్వామి, వి మల్లికార్జునరావు, రమణమూర్తి, గట్టయ్య, సుధాకర్, ప్రసాద్, హుమాయూన్, ఎస్ నాగేశ్వర్రావు, భూక్యా రమేష్, బండారు మల్లయ్య, వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.