23-11-2025 12:06:19 AM
ముంబై, నవంబర్ 22: ‘మీరు ఓట్లేయకపోతే.. నేను పైసా నిధులివ్వను’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన బారా మతి ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో మా పార్టీ ఆభ్యర్థులను తిరస్కరిస్తే ఇక మీ ప్రాంతం ఎప్పటికీ అభివృద్ధికి నోచుకోదు’ అని వ్యాఖ్యానించారు.
ఎన్సీపీకి చెందిన 18 మంది అభ్యర్థులను గెలిపిస్తే ఎన్ని నిధులు కావాలన్నా విడుదల చేస్తానని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చే విషయంలో ఏమాత్రం రాజీపడనని చెప్పుకొచ్చారు. ఇక ఓటర్లు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే తరువాయి అని పేర్కొన్నారు. ‘మీ దగ్గర ఓట్లు ఉన్నాయి. నా దగ్గర నిధులు ఉన్నాయి. మీరు తిరస్కరిస్తే.. నేను కూడా తిరస్కరిస్తా’ అని హెచ్చరించారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యా యి. బాధ్యత గల పదవిలో ఉండి కూడా అజిత్ ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ‘ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు.. ప్రజలు పన్నుల ద్వారా చెల్లించినవే’ అంటూ శివసేన నాయకుడొకరు ‘ఎక్స్’లో నిప్పులు చెరిగారు. ‘ ఒక డిప్యూటీ సీఎం హోదాలు అజిత్ పవార్ చౌకబారు వ్యాఖ్యలు చేస్తుంటే.. ఓటర్లను బెదిరి స్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?” అంటూ శివసేన (యూబీటీ)కు చెందిన అంబాదాస్ ధన్వే అనే నేత ప్రశ్నించారు