23-11-2025 12:07:51 AM
ముఠా గుట్టురట్టు.. నలుగురు నిందితుల అరెస్ట్
పది సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్, 92 బుల్లెట్లు స్వాధీనం
న్యూఢిల్లీ, నవంబర్ 22: పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల సాయంతో దేశంలోకి భారీగా ఆయుధాలను రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. డీసీపీ సంజీవ్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహన్, మోను, పంజా బ్‌కు చెందిన మన్దీప్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అత్యాధునిక పది సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్, 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో ప్రత్యక్ష సంబంధాలున్న కొంత మంది ఢిల్లీకి భారీగా అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని రోహిణిలో ఈ ఆయుధాల స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది.
సోనూ ఖత్రి ముఠా తో సంబం ధం ఉన్న మన్దీప్‌పై హత్య కేసుతో సహా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితులు డ్రోన్‌లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథ మిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. పంజాబ్ సరిహద్దుల నుంచి తీసుకొచ్చిన ఈ ఆయుధాలను గ్యాంగ్‌స్టర్‌లు లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, గోంగి గ్యాంగ్ సభ్యులకు ఇవ్వాలని నిందితులు ప్రణాళిక రచించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆయుధాలు తుర్కియో, చైనాలో తయారీ
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు చైనా, తుర్కియోలో తయారు చేసినవిగా అధికారులు గుర్తించారు. అరెస్ట్ చేసిన ముఠా సభ్యుల కార్యకలాపాలపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆయుధాలు ఎవరికి విక్రయించారు.? ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు.? నిందితుల మొబైల్ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు తదితర విషయాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.