17 April, 2026 | 3:36 AM

ఫోన్లు పోతే వెంటనే రిజిస్టర్ చేసుకోండి

14-06-2025 12:00 AM

నిర్మల్ జూన్ 13 (విజయ క్రాంతి) : సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోగొట్టుకున్న, చోరి గురైన 88 మొబైల్ ఫోన్లు (సుమారుగా పది లక్షల యాభైఆరు వేల విలువ గల ఫోన్లను) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఎస్పీ మొబైల్ వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలన్నారు. 

పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సీఈఐఆర్ వ్బుసైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఈఐఆర్ వ్బుసైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.

పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఒక  ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1416 ఫోన్లు (సుమారుగా కోటి అరవైతొమ్మిది లక్షల తొంభైరెండు వేల విలువ గల ఫోన్లను) రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. సీఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఎవరికైనా సెల్‌ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, సీఈఐఆర్ టీం కానిస్టేబుల్ నరేందర్, ప్రత్యూష,సూర్య వంశీ, రాం పవన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల ఐపిఎస్ గారితో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి,ఐటి కోర్ ఇంచార్జ్ సమ్మయ్య, ఆర్ ఐ లు రాం నిరంజన్ రావ్, శేఖర్,ఆర్‌ఎస్‌ఐ లు మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.