22-02-2026 12:00:00 AM
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తూ మరోసారి తన స్వీయ రచనాదర్శకత్వంలో రూపొందిస్తున్న కొత్త సినిమా ‘కల్ట్’. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాక్ నాయర్, చేపూరి వివేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీ నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్ విడుదలైంది. శనివారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “జనం ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నా. అవన్నీ కలిపికొట్టి ఈ సినిమా తీశా. పలక్ నామ దాస్ తీయకముందు నాలో ఒక ఆకలి ఉండేది. ఈ సినిమా తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశా. పిల్లలు, సున్నిత మనస్కులను ఈ సినిమాకు దూరంగా ఉంచండి.
ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరొక కన్ను రవి బస్రూర్. ఈ సినిమా కోసం బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్‌కి జీవితాంతం రుణపడి ఉంటా. ప్రస్తుతానికి ఆయనకు ఒక చిన్న కానుకగా రోలెక్స్ వాచ్ ఇస్తున్నా. కాలేజీలు రీఓపెనింగ్ సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తా” అన్నారు. తరుణ్ భాస్కర్, రవి బస్రూర్, డీవోపీ అరవింద్, మిగతా మూవీ యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.