అక్బరుద్దీన్‌పై నవనీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి): అక్బరుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గురువారం ప్రచా రం నిర్వహించిన ఆమె.. హిందువులను ఉద్దేశించి 2013లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘చోటూ.. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే హిందువులు లేకుండా చేస్తానన్నావు.. మీమ్ములను లేకుండా చేయడానికి 15 నిమిషాలు కాదు కదా 15 సెకన్లు సరిపోతాయం టూ’ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్ల్లింలు లేకుండా చేయడా నికి 15 సెకన్లు చాలని చెప్పిన ఆమె ను ఎవరూ అడ్డుకోవడం లేదని పరోక్షంగా సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ 15 సెకన్ల సమయం దొరకడం లేదా అంటూ అదే స్థాయిలో బదులిచ్చా రు. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.. మీ లొకేషన్ షేర్ చేస్తే మీరున్న చోటుకు మేమే వస్తాం’ అంటూ అసదుద్దీన్ స్పందించారు.






