ఐఎఫ్టీయూ జిల్లా సదస్సును జయప్రదం చేయండి
గుండాలలో విస్తృత ప్రచారం
గుండాల, (విజయక్రాంతి): సెప్టెంబర్ 1న జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగే ఐఎఫ్‌టీయూ జిల్లా సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి యాసారపు వెంకన్న పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో గ్రామపంచాయతీ, బీఓసీ, హమాలీ, కేజీబీవీ, మిషన్ భగీరథ తదితర రంగాల కార్మికుల వద్ద నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని, హమాలీ, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, మిషన్ భగీరథ వర్కర్లకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.10 వేల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న కొత్తగూడెంలో జరిగే ఐఎఫ్‌టీయూ జిల్లా సదస్సుకు ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు కన్నెగంటి రవి తదితరులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. కావున కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ ఏరియా కమిటీ నాయకులు గడ్డం నాగేష్, బానోతు చంద్యా, చేబోతు రవి, మెంతిని నాగేష్, చింత నర్సన్న, సట్టు ధనరాజ్, ఆవుల సదానందం, మాచర్ల రాకేష్, కోండ్రు శైలజ తదితరులు పాల్గొన్నారు.






