29 August, 2026 | 4:27 PM

వంతెన మంజూరుకు ఎంపీ, ప్రభుత్వ సలహాదారుల హామీ

29-08-2026 03:52 PM

దోమకొండ-బి టి ఎస్ వద్ద అండర్ పాస్ వంతెన మంజూరుకు ఎంపీ, ప్రభుత్వ సలహాదారుల హామీ

స్థలాన్ని పరిశీలించిన ఎంపీ, ప్రభుత్వ సలహాదారులు,  ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు 

కామారెడ్డి, ఆగస్టు 29,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దోమకొండ-చౌరస్తా వద్ద అండర్ పాస్ వంతెన, రహదారి విస్తరణ పనుల మంజూరీకి  జహీరా బాద్ ఎంపీ సురేష్ షెట్కార్,  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. దోమకొండ తో పాటు అంతర్ జిల్లాల ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిన వంతెనను ఎన్ హెచ్ ఏ ఐ పిడి నాగేశ్వరరావుతో పాటు ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పరిశీలించారు.  ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిన  వంతెన సమస్య విషయమై మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్, దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య వివరించారు. 

దోమకొండ- బి టి ఎస్ చౌరస్తా వద్ద ప్రయాణికులకు, భారీ వాహనాలకు అనుకూలంగా వంతెన లేకపోవడంతో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు రోడ్డు దాటటానికి కిలోమీటర్ దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. బస్సులు ఇతర భారీ వాహనాలు మూడు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి యూటర్న్ చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. దోమకొండ చౌరస్తా మీదుగా కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాల వారు ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. దూర భారం, వ్యయ ప్రయాసలు పడుతూ తమ ప్రాంతం తో పాటు అంతర్ జిల్లా ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

కొత్తగా నిర్మాణం చేపట్టాల్సిన అండర్ పాస్  వంతెన, రహదారి విస్తరణ విషయంలో  అనుకూలమైన స్థలాన్ని చూపించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ వంతెన, రహదారి విస్తరణ పనులు చేపట్టాలని వారు కోరారు.  అండర్ పాస్ వంతెన నిర్మాణంతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా ఇరువైపులా బస్సు షెల్టర్, సీసీ కెమెరాలు, రహదారి వెంట ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను విన్నవించగా, వంతెన నిర్మాణం కోసము తొందరలో సర్వే చేసి ప్రతిపాదనలు తయారు చేయించాలని ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎన్ హెచ్ ఏ ఐ  పీడీ ని ఆదేశించారు. 

తొందర్లోనే అండర్ పాస్ వంతెన, రహదారి విస్తరణ పనులకు మంజూరు ఇప్పిస్తామని ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హామీ ఇచ్చారు. గత రెండు సంవత్సరాలుగా అండర్పాస్ వంతెన విషయంలో పలుసార్లు ఎంపీకి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు, జిల్లా కలెక్టర్కు విన్నపాలు చేసుకోగా, ఎన్ హెచ్ ఎ ఐ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసినందుకు మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కటికం శ్రీనివాస్, నాయకులు సీతారాం మధు, నేతుల సుధాకర్, మల్లేశం, మహమూద్, నాగరాజులు పాల్గొన్నారు.