15 July, 2026 | 12:25 PM

గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి

15-07-2026 12:23 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందుకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది రవినాయక్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు తీవ్రరూపం దాల్చడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. రవినాయక్ మృతి వార్త తెలిసిన వెంటనే ఇల్లందు న్యాయవాద వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బార్ అసోసియేషన్ సభ్యులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రవి నాయక్ చిన్ననాటి నుంచే కష్టపడి చదువుకుని న్యాయ విద్యను పూర్తి చేశారు. తన ప్రతిభ, అంకితభావంతో న్యాయవాదిగా మంచి గుర్తింపు తెచ్చుకుని సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించారు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు సీనియర్ న్యాయవాదులు, సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.