26 June, 2026 | 2:02 AM

మంథనిలో ప్రైవేట్ పాఠశాలల అక్రమ దందా

26-06-2026 12:37 AM

అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై తల్లిదండ్రుల ఆగ్రహం

మంథని, జూన్ 25 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని, అధిక ఫీజులు వసూలు చేస్తూ, పాఠశాలల్లోనే పుస్తకాలు, నోట్ బుక్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదువును వ్యాపారంగా మార్చి, పేద, మధ్యతరగతి మరియు వ్యవసాయ కుటుంబాల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయడం చాలా బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదువు అమ్ముకోకండి

చదువుకునే వయస్సులో ఉన్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చదువు కొనే స్థాయికి తీసుకువెళ్లవద్దని పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరికలు అందుతున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని పక్కన పెట్టి, పాఠశాలల్లోనే పుస్తకాలు అమ్మడం వెనుక భారీగా లాభాలు గడించాలనే యాజమాన్యాల దురాశే కారణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తాం: విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్

ఈ అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, సంబంధిత పాఠశాలల యాజమాన్యాల పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్తామని విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు వెంటనే స్పందించి అధిక ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని, పుస్తకాల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ యాజమాన్యాలు తమ తీరును మార్చుకోకపోతే, జిల్లా విద్యాశాఖ అధికారి కి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.