calender_icon.png 2 November, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేఖరి ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

01-11-2025 07:29:31 PM

ఆళ్ళపల్లి మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండలంలో ఓ దినపత్రిక విలేఖరి ముసుగులో అక్రమ దందాలు, అవినీతికి పాల్పడుతున్నాడని స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడుతూ.. మండల పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన ఓ దినపత్రిక విలేఖరి "నేను విలేఖరి"ని అంటూ.. తన పత్రికను అడ్డుపెట్టుకొని మండల వ్యాప్తంగా అక్రమ దందాలకు పాల్పడుతున్నాడని, మండలంలోని అమాయక ప్రజలు, ఉద్యోగులు, అధికారులను బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.

ఆయా గ్రామాల్లో అవినీతికి పాల్పడి పంచాయితీలు నిర్వహిస్తున్నాడని, ఇటీవల కాలంలో మండలంలో అభివృద్ధి పనులు చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించి సిమెంట్, కంకర, రాడ్లతో సొంత ఇంటి నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. అదేవిధంగా ఆ విలేఖరి కరెంటును అనధికారంగా వాడుకుంటూ.. కరెంటు స్తభాలను విరగొట్టి తన పొలం చుట్టూ ఫెన్సింగ్ నిర్మించుకున్నాడని విమర్శించారు. పంచాయతీ కార్యాలయంలోని వీధిలైట్లను సైతం తన సొంత ఇంట్లో అమర్చుకున్నారు. మర్కోడు గ్రామంలోని ప్రభుత్వ గిడ్డంగి (నిల్వ శాల ) స్థలం, రేగడి చెరువు శిఖం భూమితో పాటు ఫారెస్ట్ భూములను కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఆళ్ళపల్లి మండల కేంద్రంలో ఓ రైతు భూమిపై సైతం ఆ విలేఖరి కన్ను పడిందని, ఆ రైతు తన భూమిలో ఇంటి నిర్మాణం చేస్తుండగా “నాకు భూమి ఇస్తావా, లేక డబ్బులు ఇస్తావా” అంటూ ఆ విలేఖరి బెదిరింపులకు పాల్పడ్డాడని స్పష్టం చేశారు. దీనిపై అడ్డుగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీకి సంబంధం లేని అధికారులపై సత్య దూరమైన ఆరోపణలు చేస్తూ, భూమి గల రైతు వద్ద అధికారులు, కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ తప్పుడు కథనం రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వార్తా కథనంలోని ఆరోపణలు నిరూపించకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.