పెద్ద చెరువు చిన్నబోయింది!
- శిఖం, బఫర్ జోన్‌లో వెంచర్లు, విల్లాలు
- తాజాగా చెరువు కట్ట నుంచి కిందకు ర్యాంపు నిర్మాణం
- చెరువు కట్ట కింద అక్రమ నిర్మాణం
- ఇరిగేషన్ అధికారుల తీరుపై అనుమానాలు
మేడ్చల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అక్రమార్కుల ధన దాహానికి, అధికారుల అవినీతికి మేడ్చల్ పెద్ద చెరువు చిన్నబోతోంది. ఒకప్పుడు పట్టణ ప్రజలకు తాగు, సాగునీరు అందించడమే గాక అనేక కుటుంబాలకు జీవనాధారమైన ఈ చెరువును కబ్జాదారులు కబళించి వేస్తున్నారు. ఇప్పటికే చెరువు శిఖం, బఫర్ జోన్ లో పదుల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు కాగా, తాజాగా కొందరు చెరువు కట్టకే గురి పెట్టారు. చెరువు కట్ట నుంచి కిందకు ర్యాంపు వేసి కట్టను ఆనుకొని భారీ నిర్మాణం చేపట్టారు.
అధికారుల కళ్ళముందే ఈ అక్రమం జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. చెరువు కట్ట తవ్వి ర్యాంపు వేస్తున్న విషయమై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అడ్డుకోలేకపోయారు. అంతేగాక ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. రాంప్ వేయడానికి మూడు ఈత చెట్లను నరికి వేశారు. నిబంధనల ప్రకారం చెరువు కట్ట రూపురేఖలు మార్చడానికి వీలు లేదు. కానీ ఇక్కడ భారీ ఎత్తులో ర్యాంపు నిర్మించారు. జాతీయ రహదారి పక్కనే ఈ అక్రమం జరుగుతోంది.
చెరువు కట్ట కింద అక్రమ నిర్మాణం
చెరువు కట్టను ఆనుకుని భారీ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి ఎలాంటి అనుమతి లేదు. పైగా ఇది బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోన్ లో నిర్మాణం జరుగుతుండగా అధికారులు అడ్డుకోకపోవడం విచారకరం. చెరువు కట్ట కిందనే కాకుండా జాతీయ రహదారి మీద కూడా మున్సిపల్ అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.
శిఖం, బఫర్ జోన్ లో వెంచర్లు, విల్లాలు
హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువుల సమీపంలో కొనుగోలుకు ప్రజలు భయపడుతున్నప్పటికీ మేడ్చల్ పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలో విల్లాల నిర్మాణం కొనసాగుతోంది. హైడ్రా పరిధి రింగ్ రోడ్డు వరకే ఉందని, మేడ్చల్ పరిధిలోకి రాదని అమాయకులను నమ్మించి విక్రయిస్తున్నారు. మేడ్చల్ పెద్ద చెరువు విస్తీర్ణం 356 ఎకరాలు. మేడ్చల్ పట్టణం నుంచి గుండ్ల పోచంపల్లి డివిజన్ సుతారి గూడెం వరకు విస్తరించి ఉంది. ఎఫ్ టి ఎల్ పరిధిలో కొన్ని వెంచర్లకు గతంలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఒక వెంచర్లో ఆరు ఎకరాల శిఖము భూమి ఉంది. వర్షాకాలంలో చెరువు నిండిన సమయంలో ఈ వెంచర్లలో నీరు నిలుస్తుంది. రియల్టర్లు ప్లాట్లు చేసి విక్రయించి వెళ్లిపోగా ప్రస్తుతం కొనుగోలుదారుల పరిస్థితి అయోమయంగా తయారయింది.
రాజకీయ నాయకుల సహకారం
చెరువు కట్టకు ర్యాంపు వేయడమే గాక కట్ట కింద అక్రమ నిర్మాణం చేస్తున్న వారికి కొంతమంది రాజకీయ నాయకులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాల విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన వ్యక్తులకు రాజకీయ నాయకులు ఫోన్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని, మాట్లాడుదామని రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రాజకీయ నాయకులు అక్రమా మార్కులకు కొమ్ము కాయడం విచారకరం.
పెద్ద చెరువును కాపాడుతాం
మేడ్చల్ పెద్ద చెరువులో అక్రమార్కుల చేతి నుంచి కాపాడుతాం. కట్ట పైనుంచి కిందకు ర్యాంపు నిర్మించిన విషయమై ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీనికి సహకరించిన వివిధ శాఖల అధికారులపై కూడా పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం.
మొల్లంగిరి శ్రీహరి చారి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి




