10 March, 2026 | 1:23 AM

శంషాబాద్‌లో అక్రమ కట్టడాల జోరు!

10-03-2026 12:03 AM
  1. 111 జీవో కు తూట్లు 
  2. అధికారుల కళ్లముందే బహుళ అంతస్తుల నిర్మాణాలు.. 
  3. నోటీసులకే పరిమితమైన చర్యలు!

శంషాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఊపిరితిత్తులుగా భావించే  జంట జలాశయాలు రంగారెడ్డి జిల్లా పరిధి లో ఉన్న (గండిపేట, హిమాయత్సాగర్) జలాశయాల పరిరక్షణ కోసం విధించిన 111 జీవో శంషాబాద్ పరిధిలో అభాసుపాలవుతోంది. నిబంధనల ప్రకారం కఠినమైన ఆంక్షలు ఉండాల్సిన చోట, అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విచిత్రమేమిటంటే, నిబంధనలను అమలు చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాలకు కూతవేట దూరంలోనే ఈ అక్రమ దందా సాగుతుండటం గమనార్హం.

111 జీవో పరిధిలోని గ్రామాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కేవలం G+1  అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ శంషాబాద్ మున్సిపాలిటీ మరియు పరిసర ప్రాంతాల్లో దృశ్యం మరోలా ఉంది. 

నిబంధనలు తూచ్..

 నిబంధనలకు విరుద్ధంగా 5 నుండి 10 అంతస్తుల వరకు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో భారీ ఫంక్షన్ హాల్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు మరియు విలాసవంతమైన అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి.క్యాచ్మెంట్ ఏరియాలో సాగుతున్న ఈ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో జలాశయాలకు వచ్చే వరద నీటి మార్గాలు మూసుకుపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.

అధికారుల ’నోటీసుల’ రాజకీయం..

అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు స్పందించే తీరు విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్మాణాలను కూల్చివేయడం లేదా సీజ్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం ‘నోటీసులు ఇచ్చాం‘ అనే మాటతో చేతులు దులుపుకుంటున్నారు.

‘అధికారుల అండదండలు లేకుండా ఇంత భారీ నిర్మాణాలు సాధ్యం కాదు. నోటీసులు ఇవ్వడం అనేది కేవలం కాలయాపన కోసమే. నోటీసు పీరియడ్లో భవన నిర్మాణం పూర్తయిపోతోంది,‘ అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల గురించి అసిస్టెంట్ జోనల్ కమిషనర్ సుమన్ రావును వివరణ కోరెందుకు ఫోన్ చేస్తే ఆయన స్పందించడం లేదు.

ప్రభుత్వం స్పందించేనా?

111 జీవో ఎత్తివేతపై న్యాయపరమైన చిక్కులు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ ఉల్లంఘనలు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, శంషాబాద్ జోన్ పరిధిలో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మరియు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అభివృద్ధి పేరిట వినాశనాన్ని కొనితెచ్చుకోకముందే ప్రభుత్వం మేల్కొంటుందా? లేదా నోటీసుల డ్రామా ఇలాగే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.