10 March, 2026 | 10:26 AM

చెరువులను సంరక్షించుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాలి

10-03-2026 12:04 AM

దాతర్ పల్లి చెరువులో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, మార్చి 9: యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలోని పెద్దచెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  బీర్ల అయిలయ్య  మాట్లాడుతూ చెరువులను సంరక్షించుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాలని, చెరువులు నిండితే సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీర్ల ఐలయ్య అన్నారు.

ఎండాకాలంలో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నామని తెలిపారు.మల్లన్న సాగర్, కొండపోచమ్మ,నావబ్ పేట రిజర్వాయర్, తపాస్ పల్లి ప్రాజెక్టుల నుండి అవకాశం ఉంటే ఆలేరు నియోజకవర్గం లోని అన్ని చెరువులు నింపడం కోసం నిరంతరం కృషి చేస్తామని  అన్నారు. రైతులకు సంవత్సరం పొడవునా సాగునీరు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అలాగే చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.