12 March, 2026 | 2:28 AM

భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలి

12-03-2026 12:36 AM

బీజేపీ జిల్లా ఉప అధ్యక్షులు నక్క రాజేశ్వర్ 

సిరికొండ, మార్చ్ 11. (విజయక్రాంతి): నిజామాబాదు రూరల్ సిరికొండ, దర్పల్లి మండలాల్లో గత సంవత్సరం ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటివరకు అందకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు నెలలు గడిచినా బాధిత రైతులకు నయాపైసా కూడా అందలేదని ఆయన పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, రామడుగు, కొండూర్, పెద్దవాల్గోట్, చిన్న వాల్గోట్ గ్రామాలతో పాటు దర్పల్లి మండలంలోని వాడి, బీరప్ప తండా గ్రామాల్లో వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. సాగు భూములు కోతకు గురై గుర్తుపట్టలేని స్థితికి చేరాయని, రైతులు భూములను మళ్లీ చదును చేసుకోవడానికి ఎకరానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.

బోర్లు చెడిపోవడంతో కొత్త బోరు బావులు తవ్వించుకోవడానికి కూడా రైతులు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అది కూడా రైతులకు అందలేదని విమర్శించారు.  ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయిందని తెలిపారు.

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు భూములు పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.1 లక్ష, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు సంజీవ్, మండల జనరల్ సెక్రటరీ మలోత్ రాజేందర్, బీజేపీ నాయకులు కనగందుల గోపి, తై బజార్ గంగాధర్, నాగులపల్లి నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.