6 April, 2026 | 8:30 PM

మునుగోడులో 6 గ్యారంటీల అమలు విఫలం

06-04-2026 06:56 PM

- రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి

- బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం డిమాండ్ చేశారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని,

అవసరమైతే స్వంత నిధులతోనే పనులు చేపడతానని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.రైతుల సమస్యలపై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ, తొక్కిపట్టి నాశనం చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.మునుగోడు అభివృద్ధి చేయలేకపోయిన రాజగోపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, ఉదయ సముద్రం, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా నీరు అందించడంలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు.