మేనిఫెస్టో అమలు నైతిక బాధ్యత
దుప్పటి మొగిలి :
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది కీలకం. ఇది ప్రజల వజ్రాయుధం. వారి తీర్పు ముందు రాజు, రైతు, ధనిక, పేద అనే భేదం ఉండదు. అందరూ సమానమే. రాజకీయ పార్టీలు ఈ తీర్పును పొందేందుకు ప్రజల ముందుకు తెచ్చే అతి ముఖ్యమైన పత్రం ఎన్నికల మేనిఫెస్టో. ఓటు వేయడమనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు. అది విశ్వాసంతో కూడిన బాధ్యత. ప్రజలకు, పాలకులకు మధ్య ఉండే ఒక పవిత్ర నైతిక ఒప్పందమే ఈ మేనిఫెస్టో.
ఇది కేవలం కాగితం ముక్క కాదు. ప్రజల భవిష్యత్తును రాసే ఒక ప్రతిజ్ఞ పత్రం. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పే హామీల సమాహారం. ఇందులో ప్రతి అక్షరం వెనుక ఒక నిరుద్యోగ యువకుడి ఆశ ఉంటుంది. అప్పుల భారంతో కుంగిపోయిన రైతు నమ్మకం ఉంటుంది. పేదవాడి బిడ్డ చదువుకోవాలనే కల ఉంటుంది. దురదృ ష్టవశాత్తు నేడు రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలను కేవలం ఓట్ల వేటలో వాడే గాలం లా మారుస్తున్నాయి.
ఎన్నికల ముందు పవిత్ర గ్రంథంలా చూపించే ఈ పత్రాలను అధికారంలోకి రాగానే పాత వార్తాపత్రికల్లా చెత్తబుట్టలో పడేస్తున్నాయి. కుర్చీ దక్కగానే హామీలు గాలిలో కలిసిపోతున్నాయి. మేనిఫెస్టోలోని అంశాలను మరిచిపోవడం అం టే కేవలం మాట తప్పడం కాదు.
అది ప్రజాస్వామ్యాన్ని వంచించడం. ప్రజల నమ్మకాన్ని నిలువునా హత్య చేయడమే అవుతుంది. మాట నిలబెట్టుకోలేని వాడిని మట్టి కూడా నమ్మదు అని పెద్దలు అంటా రు. కానీ, నేడు కోట్లాది ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిన వారు అధికారంలో గర్వంగా కూర్చుంటున్నారు.
ప్రజలకు దగ్గరగా ఉండాలి..
ఎన్నికల సమయంలో నాయకులు ప్రజ ల ముందుకు వచ్చి వినయంగా చేతులు జోడిస్తారు. వారి మాటల్లో తేనె వలుకుతుంది. కళ్లలో కృత్రిమమైన ప్రేమ కని పిస్తుంది. ప్రజల సమస్యలే తమ సమస్యలని గొప్పగా చెబుతారు. అధికారం దక్క గానే అదే నాయకుడు ప్రజలను గుర్తు పట్ట డు. వారి కష్టాలను చూడడు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు వారికి అస్సలు గుర్తుకురావు. ఒకవేళ గుర్తు ఉన్నా తమకు కావల సిన అధికారం దక్కింది కదా ఇక ప్రజలతో పనేముంది అని భావిస్తారు.
ఈ వైఖరి ప్రజల గుండెల్లో అగ్నిలా మండుతుంది. నాయకులు ప్రజలను ఎన్నుకుంటున్నారా లేక ప్రజలే నాయకులను ఎన్నుకుంటున్నారా అనే సందేహం కలుగుతోంది. మేని ఫెస్టోలో అసాధ్యమైన హామీలు గుప్పించి గద్దెనెక్కడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. రాజకీయాల్లో అబద్ధాలు తాత్కాలికంగా గెలవవచ్చు. కానీ, అవి శాశ్వతంగా నిలవ వు. ప్రజల కోపం అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందే రోజు తప్పక వస్తుంది. అబద్ధం పది అడుగులు వేగంగా పరుగెత్తవచ్చు.
కానీ నిజం ఒక్క అడుగుతో దాన్ని చేరుకుంటుంది. ఒక నిరుద్యోగ యువకుడు రాత్రిం బవళ్లు కష్టపడి చదువుకుంటాడు. రాజకీ య పార్టీలు ఇచ్చే లక్షల ఉద్యోగాల హామీని నమ్మి ఓటు వేస్తాడు. ఏళ్లు గడిచినా ఉద్యో గం రాకపోయేసరికి అతని కలలు మట్టిలో కలుస్తాయి. ఆ యువకుడి కన్నీటి బాధకు బాధ్యత ఎవరిది? అతను నమ్మిన మేనిఫె స్టో ద్రోహం చేయడం లేదా? చేసినట్టే కదా.
ఊరింపులే.. ఊరడింపులు లేవు
రుణమాఫీ చేస్తామని, గిట్టుబాటు ధర ఇస్తామని పార్టీలు ఊరిస్తాయి. రైతు ఆ మాటలను నమ్మి ఓటు వేస్తాడు. హామీలు అమలు కాక అప్పుల భారం పెరిగి రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆదుకుంటుందని నమ్మిన ప్రభుత్వమే అతని ప్రాణాలు తీసినట్లవుతుంది. ఇది కేవలం ప్రభుత్వ వైఫ ల్యం కాదు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజాప్రతినిధులు చేసిన నేరం. రైతు పంట పండక బ్యాంకు అప్పు కట్టకపోతే చట్టం అతనిపై కఠినంగా వ్యవహరిస్తుంది. అరెస్టులు కూడా చేయిస్తుంది.
కానీ కోట్లాది మందికి హామీలు ఇచ్చి అమలు చేయని రాజకీయ పార్టీలపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇది ఎంతవరకు న్యాయం? చట్టం అందరికీ ఒకే లా ఉండాలి. నేడు చట్టాలు సామాన్యుల పట్ల కఠినంగా, రాజకీయ నాయకుల పట్ల బలహీనంగా ఉన్నాయి. ఈ పరిస్థితి మారా లి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమ లు చేయని పార్టీలను రద్దు చేసే చట్టం మన కు కావాలి. వాగ్దానాలు అమలు చేయకపో తే ఆ పార్టీకి అధికారంలో కొనసాగే హక్కు ఉండకూడదు.
శిక్ష పడుతుందనే భయం ఉన్న చోటే న్యాయం ఉంటుంది. భయం లేకపోతే తప్పులు పెరుగుతూనే ఉంటాయి. నేడు రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతోం ది. అసాధ్యమైన హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయడం ఒక వ్యసనంగా మారిం ది. ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. అబద్ధాలను నమ్మి మోసపోకుండా నాయకులను నిలదీయాలి. ప్రజలు మౌనంగా ఉంటే నాయకులు మరింత సాహసం చేస్తారు. మేనిఫెస్టోలో కనీసం డ్బ్బు శాతం హామీలు నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలి.
ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులను భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేయకుండా అనరులుగా ప్రకటించాలి. ప్రజలను వంచించి అధికారం చేపట్టిన వారి ఆస్తులను జప్తు చేసేలా చట్టాలు రావాలి. ఇటీవలి కాలంలో ఉచితాల సంస్కృతి పెరిగిపోయింది. ఓటర్లను ఆకర్షించడానికి నగదు బదిలీలు, ఉచి త పథకాలు ప్రకటించడం సులభమైంది. ఈ తాత్కాలిక ప్రయోజనాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.
అభివృద్ధి అంటే పరిశ్రమలు, ఉపాధి, విద్య వంటి మౌలిక వసతులు.వాటిని వదిలేసి ఉచితాలకే ప్రాధా న్యం ఇస్తే రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటాయి. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టే పాలకులపై కేసులు నమోదు చేయాలి. ఒక ప్రభుత్వం చేసిన అప్పును తీర్చలేక మరో ప్రభుత్వం మరింత అప్పు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నెలకొంటోంది.
ప్రజలు చైతన్యవంతులవ్వాలి
ప్రజాస్వామ్యం కాగితాలపై కాదు ప్రజల చైతన్యంలో ఉండాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ప్రజలు చైతన్యం పొందితేనే రాజకీయాలు మారతా యి. ప్రజలు ప్రశ్నిస్తేనే నాయకులు జవాబు చెబుతారు. ప్రజలు తిరస్కరిస్తేనే అబద్ధపు రాజకీయాలు అంతమవుతాయి. ఓటు అనే ది ఒక చిన్న గుర్తు కాదు. అది ఒక తీర్పు, ఒక శిక్ష, ఒక ఆశీర్వాదం. చేతిలో ఉన్న కత్తి విలువ తెలిసినవాడే యోధుడు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే కత్తి విలువ తెలిసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బలప డుతుంది.
ఇప్పటికైనా ప్రజలు మేనిఫెస్టో అమలు చేయని పార్టీలను తిరస్కరించాలి. నిజాయితీ గల నాయకులను మాత్రమే ఎన్నుకోవాలి. రాజకీయ నాయకులు కూ డా గుర్తించాలి. అబద్ధాలతో గెలిచిన అధికారం శాశ్వతం కాదు. ప్రజల విశ్వాసంతో గెలిచిన అధికారం మాత్రమే చరిత్రలో నిలుస్తుంది. మేనిఫెస్టో ఒక పవిత్ర ఒప్పం దం. దాన్ని ఉల్లంఘించే వారికి ప్రజాస్వామ్యంలో స్థానం ఉండకూడదు. అబద్ధపు హామీల కోటలు కూలిపోయి నిజాయితీ కలిగిన కర్తవ్య పత్రాలుగా మేనిఫెస్టోలు మారాలి.
జవాబుదారీ ఉండాలి
ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలకు చట్టబద్ధమైన జవాబుదారీతనం తక్కువగా ఉంది. రాజ్యాం గంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసి మేనిఫెస్టోలను ఒక ‘న్యాయప రమైన ఒప్పందం’గా గుర్తించాలి. నిర్ణీత కాలవ్యవధిలో హామీల అమలుపై స్వతంత్ర కమిషన్ చేత ఆడిటింగ్ జరగాలి. హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే ‘రైట్ టు రీకాల్’ వంటి అధికారాలను ప్రజలకు కల్పించాలి.
వీటితో పా టు రాజకీయ నాయకుల్లో నైతికత అత్యంత ముఖ్యం. పదవి అనేది అధికారం చలాయించడానికి కాదు బాధ్యతను నెరవేర్చ డానికి అని గుర్తించాలి. నైతిక విలువలు లే ని నాయకత్వం సమాజానికి చేటు చేస్తుంది. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే వారికి కనీస నైతిక ప్రవర్తనా నియమావళిని చట్టబద్ధం చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం లభిస్తుంది.
వ్యాసకర్త సెల్: 84668 27118




