ఇక నక్సల్స్ రహిత భారత్
- నక్సలిజాన్ని అంతంచేసిన ఘనత మోదీ సర్కారుదే
- ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి స్థానంలేదు
- నక్సల్స్ ఎజెండాలో అభివృద్ధి అనే అంశమే లేదు
- నక్సల్స్‌కు మానవత్వం లేదు
- డెడ్‌లైన్‌కు ఒకరోజు ముందే పార్లమెంట్‌లో కేంద్ర హోమంత్రి అమిత్‌షా ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 30 : ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి స్థానంలేదని, నక్సల్స్ ఎజెండాలో అభివృద్ధి అనే అంశం లేనేలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నా రు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతం దేశాభివృద్ధి కాదని, నక్సల్స్‌ను సమర్థించేవారికి మానవత్వమే లేదని తెలిపారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావులేదని.. నక్సలిజాన్ని అంతం చేసిన ఘనత మోదీ సర్కారుదే అని, ఒక ప్పుడు మావోయిస్టులకు నిలయమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఇప్పడు నక్సలిజం అంతమైందని చెప్పారు.
మార్చి ౩1 డెడ్‌లైన్‌లోగా భద్రతా బలగాలు బస్తర్‌లో నక్సలిజాన్ని అంతం చేశాయని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. సమాజంలో అన్యాయాలకు పరి ష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని, ఆయుధాలు చేపట్టడం సరైన మార్గం కాదని తెలిపారు. 4,800 మందికి పైగా నక్సల్స్ ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస కార్యక్రమంలో పాల్గొన్నారని అమిత్ షా చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీలకు సంక్షేమ ప్రయోజనాలను అందించడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షాలు నక్సల్ శక్తుల పట్ల సానుభూతి చూపుతున్నాయని ఆరోపించారు. నక్సల్స్ తరఫున మాట్లాడేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 1970 నుంచి ఇప్పటివరకు నక్సలిజాన్ని ఎందుకు అంతం చేయలేకపోయారు? అని ఆయన ప్రశ్నించారు.
ఈ అంశాన్ని చారిత్రక నేపథ్యంలో వివరిస్తూ, ఒకప్పుడు బిర్సా ముండా, తిలకా మాంఝీ, రాణి దుర్గావతి వంటి నాయకుల స్ఫూర్తితో వెలిగిన గిరిజనవర్గాలు, పాలనాపరమైన లోపాల కారణంగా మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యాయని అమిత్ షా అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో.. కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించిందని, ఇంతకాలం గిరిజనవర్గాలు ఎందుకు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయని ఆయన ప్రశ్నించారు.
దేశం నక్సల్ రహిత భారతంగా మారేరోజు దగ్గరలో ఉందని హోంమంత్రి స్పష్టంచేశారు. మోదీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్నాయని అన్నారు. ప్రస్తుతం గ్యాస్, రేషన్, తాగునీరు, పాఠశాలలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. భద్రత విషయంలో తగ్గేది లేదని, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని, ఇంకా ఆయుధాలు వీడని నక్సలైట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు.
‘మీరు రాజ్యాంగాన్ని తిరస్కరించి ఆయుధాలు చేపట్టలేరు. దీనిని సహించబోం’ అని అమిత్‌షా వివరించారు. మోదీ ప్రభుత్వం చర్చలకు, సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, సాయుధ ఉద్యమాలు షరతులు విధించడానికి లేదా అడ్డంకులు సృష్టించడానికి అనుమతించబోమని ఆయన తెలిపారు. ఎందరో భద్రతా సిబ్బందిని నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారని, వారి అజెండాలో అభివృద్ధి లేదని, కేవలం ఉనికి కోసమే పోరాడరని మండిపడ్డారు. నక్సలైట్లను భగత్‌సింగ్, బీర్సాముండాలతో పోల్చొద్దని వ్యాఖ్యానించారు.
సల్వాజుడుం కేసు తీర్పుపై ఖండన
సల్వాజుడుం కేసులో 2011లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖండిం చారు. ఆ తీర్పు ఇచ్చిన జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డిని ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఆయన విమర్శించారు. ఆ తీర్పుతో ఆ తర్వాత సల్వాజుడంతో సంబంధం ఉన్నవారిని నక్సలైట్లు లక్ష్యంగా చేసుకుని చంపేశారని ఆయన అన్నారు.
నక్సలైట్లతో కేంద్రం చర్చలు జరపాలంటూ నిన్నమొన్నటి వరకు ‘అర్బన్ నక్సల్స్’ వాదించారని, గత ఆరు రోజుల్లో తను 2,000 వేల వ్యాసాలను సమీక్షించానని తెలిపారు. వాటిలో మావోయిస్టులకు వంతపాడడమే ఉందన్నారు. నక్సలిజానికి కాంగ్రెస్ మద్దతుగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో గుమ్మడి విఠల్ (గద్దర్)ను రాహుల్ గాంధీ కలిశారని, అర్బన్ నక్సల్స్‌తో ప్రతిపక్ష నేతకు సంబంధాలు ఉన్నాయన్నారు.
అజ్ఞాతంలో ఆరుగురు: డీజీపీ శివధర్‌రెడ్డి
ఇంకా అజ్ఞాతంలో ఆరుగురు మావోయిస్టులు ఉన్నారని, వారు, వారి కేడర్ అంతా ఇప్పటికైనా ఆయుధాలు వీడాలని, జనజీవనస్రవంతిలోకి రావాలని, కుటుంబాలతో కలిసి ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు డీజీపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులను వారిని ఆయా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించాలని, శాంతిమార్గాన్ని అనుసరించేలా చైతన్యం చేయాలని కోరారు.
జన జీవన స్రవంతిలో కలిసే వారందరికీ భద్రత, గౌరవం, కొత్త జీవితానికి అవసరమైన అన్ని సహాయాలను అందించడంలో తెలంగాణ పోలీసులు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. హింసామార్గాన్ని విడిచిపెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతిలో భాగస్వాములు కావాలని తెలంగాణకు చెందిన, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వివిధ మావోయిస్టు కేడర్లలో పనిచేస్తున్న వారికి సూచించారు.
ముప్పాల్ల లక్ష్మణరావు అలియస్ గణపతి(జగిత్యాల జిల్లా), పుసునూరి నరహరి అలియాస్ సంతోష్ (హనుమకొండ మండలం), వర్త శేఖర్ అలియాస్ మంగ్తు (సికింద్రాబాద్), జోడే రత్న బాయి అలియాస్ సుజాత(గద్వాల జిల్లా), నక్క సుశీల అలియాస్ రేలా (హైదరాబాద్), రంగబోయిన భాగ్య అలియాస్ రూపి (సిద్దిపేట జిల్లా) అజ్ఞాతంలో ఉన్నారని వివరించారు. గత రెండు సంవత్సరాలలో మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరికి సమగ్ర పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం, ప్రయోజనాలు అందజేశామని వెల్లడించారు.




