కల్తీ నియంత్రణకు కఠిన వ్యవస్థ
- హైడ్రా, ఈగల్ తరహాలో ఆహార కల్తీ మాషియాకు అడ్డుకట్ట వేస్తాం
- కేసీఆర్‌ను గృహ నిర్బంధం చేశారు
- హరీశ్‌రావు కాలనాగు కన్నా ప్రమాదకరం
- డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం
- సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు, కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్, హైడ్రా తరహాలో అత్యాధునిక అత్యంత కఠినమైన వ్యవస్థను తీసుకురానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్లను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆహార భద్రతా చట్టాలను, వ్యవస్థలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని సీఎం తెలిపారు. అధ్యయనం అనంతరం పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ మాఫియాకు బుద్ధి చెపుతామని హెచ్చరించారు. శాసన మండలి కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యతో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
దేశంలో రైతుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందన్నారు. రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని, కానీ అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారని, అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు.
దొడ్డు బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్పా పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించామని, అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని తెలిపారు. ఇందుకోసం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని ప్రోత్సహించామని అన్నారు. రాష్ట్రం లో 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు.
భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చునని పేర్కొన్నా రు. సన్న బియ్యం కోసం ఏడాదికి రూ.14,560 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. సన్నధాన్యానికి రూ.500 బోనస్ రూపంలో అదనంగా ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చ చేస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని, పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు.
నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు అసెంబ్లీలో సన్నబియ్యం భోజనం పెట్టామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్ఠికాహారం అందిస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు.
పంట మార్పిడిపై రైతులకు అవగాహన
వరి ఉత్పత్తిలో తెలంగాణలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నదని సీఎం తెలిపారు. ఇప్పుడు వరి ఒక్కటే కాకుండా ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక్కో పంటను ఎక్కువగా రైతులు పండిస్తున్నారని, ఇంకా ఎక్కువగా ఉత్పత్తి జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి ఆధారపడకుండా ఉంటుందని, తద్వారా భవిష్యత్‌లో వీటన్నింటిని రేషన్ షాపుల ద్వారా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.
పంటలకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఈ దళారీ వ్యవస్థకు చరమగీతం పాడి, రైతులకు సరైన న్యాయం చేసేందుకే తాము కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే పెద్ద నేరమని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే అక్రమ నిల్వదారులను వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు.
కేసీఆర్‌తోనే నాకు గుర్తింపు
‘రావణుడు ఉంటేనే రాముడి గొప్పతనం ప్రజలకు తెలిసింది. శకుని లేకుంటే కృష్ణుడికి గుర్తింపు వచ్చేదా..? అట్లనే కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది ’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు జనానికి తెలిసేవి కావన్నారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారని, కానీ ఆయనను కేటీఆర్, హరీశ్‌రావు కలిసి గృహ నిర్బంధం చేశారనే అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌తో తనకు పోలిక లేదని, ఆయన వరి వేస్తే ఉరే అన్నాడు.. తాను మాత్రం వరి వేస్తే బోనస్ ఇస్తున్నానని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కాలనాగు కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించా రు. కాగా పార్టీ ఆదేశాల మేరకు కేరళలో రెండు ప్రచారానికి వెళ్లనున్నట్లు తెలిపారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీరని నష్టం
పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజనతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంపీ ల సంఖ్య చాలా వ్యత్యాసం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడున్న ఎంపీల సంఖ్యకు 50 శాతం సీట్లు పెంచితే దక్షణాదికి, ఉత్తరాది రాష్ట్రాల మధ్య 410 ఎంపీ సీట్లు గ్యాప్ వస్తుందని వివరించారు. దక్షిణాదిలో 130 ఎంపీ సీట్లు ఉన్నాయని, వీటిలో 50 శాతం అంటే అదనంగా 65 సీట్లు పెరుగుతాయన్నారు. పెరిగిన సీట్లతో మొత్తం దక్షిణాది లో 195 సీట్లే ఉంటాయన్నారు.
ఉత్తరాదిలో ప్రస్తుతం 412 ఎంపీ సీట్లు ఉన్నాయని, వీటిలో 50 శాతం అంటే 206 సీట్ల పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతమున్న ఎంపీ సీట్లు, పెరిగిన సీట్లతో కలిపి మొత్తం 618 ఎంపీ సీట్లు అవుతాయన్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 542 ఎంపీ సీట్లు ఉండగా, పెరిగిన సీట్లు కలిపి 800లకు పైగా ఎంపీ సీట్లు అవుతాయన్నారు.
వీటిలో కేవలం ఉత్తరాది రాష్ట్రా ల్లో 618 ఎంపీ సీట్లు ఉంటాయని, ఇక దక్షిణాది అవసరం కేంద్రానికి ఉండదని, అప్పు డు దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుందని, తద్వార ఆర్థికంగా ఇబ్బందు లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేష్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణను చాలా తెలివిగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని సీట్లు పెరిగితే అన్ని మహిళా రిజర్వేషన్లు వస్తాయని, ఇప్పుడు ఎంతోకొంత దక్షిణాదిని గుర్తిస్తున్నారని, సీట్ల పెంపులో వ్యత్యాసం వస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డి లకు రాజకీయంగా అవకాశాలు ఉండవన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యం జరిగితే రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇస్తూ.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆ పాలన వస్తే.. తెలంగాణలోనూ వస్తుందన్నారు.
‘సన్నబియ్యం’ ఆలోచన సీఎందే
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
రాష్ట్రంలో అమలవుతున్న సన్నబియ్యం పథకం ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డిదేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఈ అద్భుతమైన ఆలోచన చేశారని, ఆ ఘనత పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారమైనా పేదలు గౌరవంగా, కడుపునిండా భోజనం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు.
సన్నబియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఏటా రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. గతంలో తమ అధినేత్రి సోనియా గాంధీ తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఆశయాలకు తెలంగాణలో పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలోని సుమారు 3 కోట్ల 39 లక్షల మంది సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతు న్నారని మంత్రి వివరించారు.
అర్హులైన వారు ఎవరైనా సరే, రాజకీయాలకు అతీతంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.40 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరుతున్నాయని, ఎక్కడా జాప్యం జరగకుండా పౌరసరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.




