calender_icon.png 19 February, 2026 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇమ్రాన్ ఖాన్ హత్యకు పన్నాగం

19-02-2026 02:58:12 AM

అసిమ్ మునీర్, మొహిసిన్ నఖ్వీ కుట్రదారులు

మాజీ ప్రధాని తోబుట్టువుల సంచలన ఆరోపణ 

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై ఆయన సోదరీమణులు చేసిన ఆరోపణలు అక్కడ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను అంతమొందించేందుకు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ కుట్ర పన్నారని ఆయన సోదరీమణులు ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ ఆరోపించారు. ఈ విషయంలో తాము నోరు విప్పకుండా మొహిసిన్ నఖ్వీ తమను బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు.

జైలులో ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల ఆయన కుడి కంటి చూపు 85 శాతం వరకు దెబ్బతిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కేవలం 15 శాతం చూపు మాత్రమే మిగిలి ఉందని, దీనికి జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇమ్రాన్‌కు తక్షణమే ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ మద్దతుదారులు పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాలను కలిపే కీలకమైన అటాక్ వంతెనను దిగ్బంధించారు. ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ భవనం వద్ద కూడా భారీ ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. మున్ముందు అవి పెరిగే అవకాశం ఉంది.