19-02-2026 03:00:02 AM
2030 నాటికి భారత ఐటీరంగం 400 బిలియన్ డాలర్ల స్థాయికి..
ప్రధాని మోదీ ఆశాభావం
భారత్ ఏఐ రంగంలో సాధిస్తున్న పురోగతిపై ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : ఏఐ (కృత్రిమ మేధ) అనేది సాంకేతిక విప్లవం మాత్రమే కాదని, ఇది ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏఐ వల్ల భారత ఐటీ రంగం 2030నాటికి 400 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఏఐ (కృత్రిమ మేధ) రంగంలో సాధిస్తున్న పురోగతిపై ప్రధాని మోదీ,గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సుదీర్ఘంగా చర్చించారు. భారతీయ విద్యార్థులు, నిపుణుల్లో ఉన్న అద్భుతమైన ప్రతిభను గూగుల్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే అంశంపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సుందర్ పిచాయ్‌తో సమావేశం కావడం సంతోషంగా ఉందని, మన దేశ నిపుణుల నైపుణ్యం గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఎంతో దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా సుందర్ పిచాయ్ భారత్‌లో గూగుల్ చేయబోయే భారీ పెట్టుబడుల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ. 1.25 లక్షల కోట్ల పైచిలుకు) వ్యయంతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఇది అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న అతిపెద్ద ఏఐ హబ్ కావడం విశేషం. ఈ కేంద్రం రాబోయే ఐదేళ్లలో భారత్ డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.