calender_icon.png 19 February, 2026 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుస్తులు లాగడమూ అత్యాచారయత్నమే..

19-02-2026 02:56:40 AM

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఆగ్రహం 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: మహిళ శరీర భాగలు తాకడం, ఆమె దుస్తువులు విప్పడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం కిందకు రాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేయాలని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. లైంగిక నేరాల కేసుల్లో తీర్పు ఇవ్వడానికి చట్టపరమైన తర్కంతో పాటు సానుభూతి కూడా అవసరమని పేర్కొంది.

అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని, వెంటనే జోక్యం చేసుకోవాలని వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని గత విచారణ సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా తుది తీర్పు వెలువరించింది. 

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల కూతురితో కలిసి 2021 నవంబర్‌లో బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తోంది. ఆ సమయంలో వారికి తెలిసిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి బాలికను ఇంటి దగ్గర దింపుతామని చెప్పి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఆ బాలికను ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి అసభ్యంగా తాకడం మొదలుపెట్టారు.

ఆమె వేసుకున్న దుస్తులను తీసేందుకు ప్రయత్నించారు. బాలిక అరవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు జడ్డి  బాలిక వక్షోజాలను తాకడం, దుస్తులను విప్పడానికి ప్రయత్నించడం అత్యాచారం కిందకు రాదని పేర్కొన్నారు. ఆ కేసును కొట్టేశారు.