calender_icon.png 16 December, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోయిన్ ప్రత్యూష జీవిత కథలో..

15-12-2025 12:00:00 AM

నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది. వరుస సినిమాలతో బిజీగా మారిన ఆమె, 2025లో విడుదలైన ఐదు చిత్రాల్లో ఎక్కువ సినిమాలు సూపర్ హిట్లు కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. కమర్షియల్ సినిమాలతో పాటు కథకు ప్రధాన ప్రాముఖ్యత ఉన్న స్క్రిప్ట్‌లను కూడా ఎంచుకుంటూ ముందుకెళ్తున్న రష్మిక, 2026లోనూ పలు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోయే తన తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన బజ్ నెలకొంది. తాజా టాక్ ప్రకారం.. వెంకీ కుడుముల తెరకెక్కించబోయే కొత్త సినిమా ఓ బయోపిక్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది. ఈ బయోపిక్ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా ఉండబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. రష్మిక ఇప్పటికే కథ విన్నారని, ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి భావోద్వేగభరిత పాత్ర చేయడం కెరీర్‌లో మైలురాయిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే కొంతమంది మాత్రమే కెరీర్ పీక్‌లో ఉండగానే ఇలాంటి సున్నితమైన బయోపిక్ చేయడం రిస్క్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, తెలంగాణలోని భువనగిరిలో జన్మించిన ప్రత్యూష చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.

చిన్నప్పటి నుంచే మోడలింగ్‌లో రాణించిన ప్రత్యూష ‘ఉత్తమ స్మైల్’ అవార్డు అందుకుంది.17 ఏళ్ల వయసులో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, 1998-2002 మధ్యలో తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2002 ఫిబ్రవరి 23న 20 ఏళ్ల వయసులో ఆమె అకాల మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.