16 April, 2026 | 2:22 PM

నిశ్చల నిశ్శబ్ద నిశీధిలో

20-10-2025 12:00 AM

టీవీ హాల్ వదిలి బెడ్రూం చేరుకున్నాను 

కలాన్ని కాగితాల్ని తెచ్చుకున్నాను

కిరణాలై హోరెత్తిన 

కలల అలల్ని రికార్డు చేస్తూ 

హరిణాలై జోరెత్తిన అలల కలల్ని ఫైల్ చేస్తూ ఆమె వచ్చింది 

వంటిల్లు సర్దేసి

సిట్ ఔట్ మూసేసి 

ఆమె వచ్చింది

పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి 

నవ్వుల్ని పువ్వుల్ని తెచ్చి 

ఆమె వచ్చింది 

రమ్మని పిలవదు ఏదో మిష 

నేను వచ్చే వరకు అనిమిష 

ఆమె కాలం పూలకొమ్మకి 

రాలిన క్షణపల్లవ రాశి

నిశ్చల నిశ్శబ్ద నిశీధిలో నివురుగప్పిన 

శశి వంటి విరుపులో మింటి మెరుపులు కనుగొనలేనా.. 

ఇప్పుడు సమన్యాయం 

సత్వర న్యాయం కావాలి

కౌగిలి సౌధం నిర్మించి 

కలల లోకం విహరించి తక్షణమే 

ఆమెకు నిద్రదానం చేయాలి 

నాలో విలీనం కావాలనే వాంఛకి 

మలినం లేని హృదయం చాలదా 

ఇక అనామిక చిత్రసుందరం  

అలౌకిక శిల్పమందిరం 

ఈ రేయికి ఖననం 

గీసిన రేఖల్లో వర్ణాంబరం 

వేసిన బొమ్మల్లో ప్రాణార్ణవం 

రేపటి వేకువలో జననం 

బో కోటం చంద్రశేఖర్