16 April, 2026 | 2:22 PM

శ్రమైక జీవన ‘వర్గమూలం’

20-10-2025 12:00 AM

కవి మద్దికుంట లక్ష్మణ్ కవిత్వం కేవలం ఒక అక్షరాల కూర్పు కాదు. అది నిత్యజీవితంలోని నిగూఢ సత్యాలను, అంతరంగపు ఆవేదనను, సామాజిక వాస్తవాల చిత్తరువులను నిలువెత్తుగా ఆవిష్కరించే ఒక దర్పణం. ఆయన కలం నుంచి జాలువారిన కవితా పంక్తులు పాఠకుల గుండెల్లోతుల్లోకి చొచ్చుకుపోయే శక్తిని కలిగి ఉంటాయి. ‘వర్గమూలం’ కవితల సంకలనంలోని కవితలను పరిశీలిస్తే.. కవిలోని తాత్విక చింతన, సున్నితమైన భావాలు మన మనోఫలకంపై సాక్షాత్కరిస్తాయి.

‘లెక్క ప్రకారం’ అనే కవిత లో భార్యాభర్తలు కుటుంబంతో పెనవేసుకున్న బాంధవ్యాలు, బాధ్యతల గాఢతను వివరించారు. భార్య క్రియాశీలక పాత్రను ‘ఆమె కూడా అందరి/ పిల్లల పెంపకంలోనూ/ వారి అభివృద్ధిలోనూ/ లెక్క ప్రకారం పాలుపంచుకుంది’ అంటూ కొనియాడారు.

భర్త బాధ్యతలను ‘ఉద్యోగ ధర్మంలోనూ/ గృహ ధర్మంలోనూ/ అతనెన్నడూ లెక్కతప్పినవాడు కాదు’ అని ప్రకటిస్తారు. పిల్లలు చేతికొచ్చిన తర్వాత ‘వాళ్ల పిల్లలూ అంతే/ వాళ్లూ లెక్క తప్పలేదు’ అంటూ.. కాసేపు మనల్ని ఆలోచింపజేసి ‘ఆస్తుల్ని పంచుకున్నట్టే/ తల్లిదండ్రుల్ని తలా ఒకరిని పంచుకున్నారు’ అనే విషాదానికి అక్షర రూపం ఇస్తారు. 

‘వర్గమూలం అనే కవితలో నది తన ప్రయాణంలో సముద్రానికి చేరువయ్యే కొద్దీ ఆవిర్భవించే సంఘర్షణను మనిషి జీవితాల్లోని ఆటుపోట్లకు అనుసంధానిస్తారు. ‘తీరా నదీ తరం ఒండొరులు ఏకమై/ సముద్ర గర్భంలో కలిసే సమయాన/ నదిని తీరానికీ తీరా న్ని నదికీ/ అప్పగింతలు చెప్పి/ ఒంటరి కన్నీటి సాగరమవుతుంటాను’ అంటూ జీవన సంఘర్షణను ఆవిష్కరిస్తారు.

‘దూరం’ కవితలో ‘దారి పొడుగునా పంట కాలువలు/ త్రోవ ఇరుప్రక్కలా ఆకుపచ్చ సోయగాలు/ ఎండాకాలంలోనూ ఎడతెగక పారే నది/ ఎండలో వెండిలా మెరుస్తూ/ ప్రవాహానికి ఎదురీదే చందమామలు/ చేలల్లో పని పాట లు చేస్తూ శ్రమజీవులు’ అంటూ పల్లెదనపు అచ్చమైన ప్రకృతి దృశ్యాలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తారు.

కార్పొరేట్ శక్తుల ప్రకృతి విధ్వంసంపై ‘ప్రపంచాన్ని పెట్టుబడితో అలుముకున్న వాడికి/ ప్రజలైనా ప్రకృతైనా పచ్చనోట్ల కిందే లెక్క/ అడవిని చెరపడుతున్నానని భ్రమించే వాడికి/ గాలిని బంధిస్తున్నానని మురిసే వాడికి/ ఈ అడవితో ఈ గాలితో పెనవేసుకున్న/ మా జీవితాలెలా అర్థమవుతాయి?’ అం టూ ‘మిగులు మనుషులం కాదు’ అనే కవితలో నిప్పులు చెరుగుతారు.

‘విషాయన్ని కూడా ఎంత ‘మాజా’గా తాగొచ్చో/ కూల్‌డ్రింక్ కంపినోన్ని అడుగుండ్రి/ కండ్లకు కట్టినట్టు చెప్తడు/ పురుగు మందుల కంపినోన్ని/ అడుగుండ్రి నువద్దిగ చెప్తడు’ అంటూ సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలపై గొంతెత్తుతాడు. ‘సిరిసిల్ల రోడ్ల సాక్షిగా శవయాత్రలు/ మానేరు తల్లి కన్నీటి చారల సాక్షిగా/ శవదహనాలను మోస్తున్న రోడ్లను, కడుపులో దాచుకుంటున్న/ మానేటిని అడుగుండ్రి చెప్తయి’ అంటూ ‘ఫికరు’ కవితలో హృద యం ద్రవించేలా పలవరిస్తాడు.

‘వాళ్లెన్నడూ/ కడుపుకింత కమ్మగ తిని/ కంటినిండా నిద్రపోయిన వాళ్లు కాదు/ వాళ్ల బ్రతుకు/ పొలంలనే పొద్దుగూకి/ పొలంలనే తెల్లారుతది/ మన్ను బుక్కి మన్ను కక్కుతరు’ అంటూ ‘తక్కెడలో చెమట చుక్కలు’ కవితలో శ్రమజీవుల కష్టాన్ని వివరిస్తారు. 

లక్ష్మణ్ కవిత్వం ఆధునిక తెలుగు కవిత్వంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆయన కవిత్వంలోని భావగర్భితమైన ఆలోచనలు, జీవితాన్ని నలువైపుల నుంచి పరిశీలించే నైపుణ్యం, శ్రమైక జీవన ఆరాధన, వాస్తవికతను సౌందర్యాత్మకంగా వ్యక్తీ కరించే సామర్థ్యం ఆయన్ను గొప్ప ఆలోచనాపరుడిగా నిలుపుతాయి. సున్నిత హృదయం కలిగిన కవిగా నిరూపిస్తాయి. ఆయన కవితా పంక్తుల్లోని భావధార పాఠకుల్లోని భావ తరంగాలను తట్టిలేపుతుంది. అంతిమంగా అనుభూతి చెందేలా చేస్తుంది. ఇది కేవలం కవిత్వం కాదు, కాలంతో సంభాషిస్తున్న ఒక జీవితం తాలూకు ‘వర్గమూలం’ అని చెప్పవచ్చు.

రతన్‌రుద్ర