16 April, 2026 | 2:23 PM

రోజూవారీ పాఠం

20-10-2025 12:00 AM

పొద్దు పొడుస్తున్న

లేలేత కిరణాల నుంచి

అసంకల్పితంగా లేచిన దేహం

కాలినడక ముచ్చట్ల నుంచి

ఓ కొత్త పాఠాన్ని నేర్చుకుంటుంది !

వృత్తిని జీర్ణించుకున్న మనసు

బాల్యం భవితకు రోజుకో తరగతి గదిని

నిర్మించుకుంటుంది..

పిల్లల హృదయ సూత్రాలను

పసిగట్టిన నేత్రాలు

మనో పలకలకు బలపం కట్టు కుంటాయి

నల్లబల్లపై అన్నం మెతుకుల తెల్లదనాన్ని

సుద్దముక్కలు 

ఇంద్ర ధనుస్సులా పరుస్తాయి

అలా బతుకొక  పాఠమై పోతుంది !

పుస్తక పువ్వులు

పురివిప్పిన నెమళ్లవుతాయి

పేజీలు పేజీలుగా 

పిల్లల మోములు

రెపరెపలాడుతాయి

తనువూ మనసూ

కలియదిరిగిన

స్వేచ్ఛా భాషా స్వరాలు

గుండెను జెండా చేసుకుని

బడి గుమ్మానికి

తోరణాలు కడతాయి

తల్లిపాల తీపిదనాన్ని

గ్రోలినట్టు మాతృభాషా

మాండలికాల మాధుర్యం

పసి హృది నిండుతుంది

పట్టపగలే వెన్నెల తుమ్మెదలై

ఒజ్జ చెట్టుపై

పిల్లలంతా వాలిపోతారు !

ఎవ్రీ చైల్డ్ రీడింగ్ లా

పిల్లల పువ్వులు నవ్వుల్ని పూస్తాయి

రోజువారీ పాఠం

నిజంగానే అమృతం కురిసిన

అద్భుత ఘట్టమై ఆవిష్కృతమవుతుంది!

 డాక్టర్ కటుకోఝ్వల రమేష్